ఉమా మహేశ్వరుల ఆరాధనా ఫలితం !
సదాశివుడు తన భక్తుల ఆపదలను ... అవసరాలను గుర్తిస్తూ సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాడు. భక్తులు తలచినా ... పిలిచినా ఆయనకి ఆనందమే. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చడమే తనకి సంతోషమన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన మనసు మంచుకన్నా చల్లనైనదని చెప్పడానికి ఆధ్యాత్మిక గ్రంధాలలో అనేక నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి.
ఇక భక్తులను ఆదుకునే విషయంలో ఎంతమాత్రం ఆలస్యం కాకుండా స్వామివారిని తొందరచేసేది అమ్మవారే. తల్లి మనసు నుంచి పుట్టే ఆతృత ... ఆరాటం ఈ విశ్వంలో ఇంకెక్కడా కనిపించవు. తన బిడ్డలకి ఆకలవుతూ ఉంటే తల్లి ఎలా నిలవలేదో, తన అనుగ్రహం అవసరమైనవారిని ఆదుకునేంత వరకూ అమ్మవారు కూడా అలాగే నిలవలేదు.
అందుకే సంతాన సౌభాగ్యాల కోసం మహిళా భక్తులు అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆలయాలను దర్శించి కుంకుమ పూజలు చేయిస్తుంటారు ... చీరసారెలు సమర్పిస్తుంటారు. కార్తీకమాసంలో స్వామివారి సేవలోను ... అమ్మవారి అనుగ్రహంతోను తరించిన భక్తులు, మార్గశిరంలో అడుగుపెడుతూనే ఉమా మహేశ్వరుల అనుగ్రహాన్ని కోరుతూ వారిని ఆరాధిస్తారు.
'మార్గశిర శుద్ధ తదియ' రోజున వ్రత విధానం ద్వారా భక్తులు ఉమామహేశ్వరులను పూజిస్తుంటారు. ఈ రోజున ఉమామహేశ్వర వ్రతం ఆచరించినవారు ఆదిదంపతులకి ప్రీతిపాత్రులవుతారు. ఫలితంగా ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... సంతాన సౌభాగ్యాలు లభిస్తాయని చెప్పబడుతోంది.