ఇక్కడికి వినాయకుడు ఇలా వచ్చాడట !
బాల భక్తులైనటు వంటి ప్రహ్లాదుడినీ ... ధృవుడిని శ్రీమహావిష్ణువు అనుగ్రహించాడు. అదే విధంగా మార్కండేయుడినీ ... సిరియాళుడిని పరమశివుడు కరుణించాడు. అలాగే బాలుడైనటువంటి 'బల్లాల్' ను వినాయకుడు అనుగ్రహించిన కథనం మనకి 'పాలీ' క్షేత్రంలో వినిపిస్తుంది. ఇది మహారాష్ట్ర - రాయఘడ్ జిల్లా పరిధిలో దర్శనమిస్తుంది.
ఈ ప్రాంతంలో 'బల్లాల్' అనే ఒక బాలుడు తన స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతుండేవాడు. ఒక రోజున అతను స్నేహితులతో కలిసి ఆడుతూ ఉండగా ఒక రాయి కనిపిస్తుంది. అది వినాయకుడి ఆకృతిని పోలి ఉండటంతో, దానిని ఒక ప్రద్రేశంలో ఉంచి దాని చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతుండేవాడు. మిగతా పిల్లలు అతణ్ణి అనుసరిస్తూ ఉండేవాళ్లు.
రోజులు గడుస్తున్నా కొద్దీ వినాయకుడి ఆకారంలో ఉన్న రాయితో అతనికి ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. దాంతో ఆ రాయిని తనకి తోచిన విధంగా ఆరాధిస్తూ ఎక్కువ సమయాన్ని అక్కడే గడుపుతుండేవాడు. ఈ విషయం తెలిసిన బల్లాల్ తండ్రి అక్కడికి వచ్చి ఆ రాయిని విసిరి పారేసి, తన కొడుకుని కొడుతూ అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు.
వినాయకుడి ఆరాధనకే విఘ్నం కలగడం బల్లాల్ కి ఆశ్చర్యమనిపిస్తుంది. దెబ్బలతో బాధపడుతోన్న బల్లాల్ దగ్గరికి బాలుడిగానే వినాయకుడు వస్తాడు. బల్లాల్ ను ఓదార్చి అతని కోసం తాను ఆ ప్రాంతంలో ఆవిర్భవిస్తున్నట్టు చెబుతాడు. బల్లాల్ ముచ్చట తీర్చడం కోసం ఆ ప్రదేశంలో కొలువుదీరతాడు. బల్లాల్ కోసం స్వామి ఇక్కడ ఆవిర్భవించాడు కనుక ఇక్కడి వినాయకుడిని 'బల్లాలేశ్వర్' పేరుతో కొలుస్తుంటారు. బల్లాల్ కి దొరికినట్టుగా చెప్పబడుతోన్న వినాయకుడి ప్రతిమను పోలిన రాయి కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉండటం విశేషం.