పార్వతీదేవి ఇలా సెలవిచ్చిందట !

పంచారామ క్షేత్రాల్లో 'ద్రాక్షారామం' ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడ ఈశ్వరుడు ... భీమేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. సాక్షాత్తు సూర్యభగవానుడిచే ప్రథమ పూజను అందుకున్న ఇక్కడి భీమేశ్వరుడు మహిమాన్వితుడుగా చెప్పబడుతున్నాడు.

దేవతలు ... మహర్షులు దర్శించే ఈ దివ్యక్షేత్రం ... 'దక్షిణ కాశి'గా చెప్పబడుతోంది. సాక్షాత్తు పార్వతీదేవి ఈ క్షేత్రం దక్షిణ కాశి అని వ్యాస మహర్షితో చెప్పిందట. కాశీ నగరంలో వ్యాసమహర్షి తన శిష్యులతో కలిసి భిక్షను స్వీకరిస్తూ ఉండేవాడు. ఒకసారి ఎవరూ భిక్ష ఇవ్వకపోవడంతో ఆకలి బాధతో ఆగ్రహించిన ఆయన కాశీ నగరాన్ని శపించబోతాడు.

ఆ క్షణంలోనే పార్వతీ పరమేశ్వరులు ఆయన ఎదుట నిలిచి ఆకలి తీరుస్తారు. వ్యాసుడి ఆకలి బాధ తీరాక, ఆయన కాశీ నగరం పట్ల ఆగ్రహావేశాలకు లోనుకావడం గురించి ప్రస్తావిస్తూ ఆదిదేవుడు అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇక కాశీలో ఉండే అర్హత ఆయనకి లేదని అంటాడు. స్వామి సేవకు దూరంగా వెళ్లడం తనవల్ల కాదని చెబుతాడు వ్యాసుడు.

ద్రాక్షారామంలో స్వామివారు భీమేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడనీ, దక్షిణ కాశి అయిన ఆ క్షేత్రానికి చేరుకొని స్వామివారిని సేవించమని పార్వతీదేవి చెబుతుంది. దాంతో పార్వతీ పరమేశ్వరుల దగ్గర సెలవు తీసుకున్న వ్యాసుడు, ద్రాక్షారామ భీమేశ్వరుడిని చేరుకొని ఆయన సేవలో తరిస్తాడు. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన కాశీని దర్శించిన ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News