ఈ రోజున గంగా స్నానం చేస్తే చాలు
గంగానదికి సమానమైన నది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి గంగానదిలో స్నానం చేయడం వలన, జన్మజన్మలుగా పీడిస్తూ వస్తోన్న పాపాల ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ముందుజన్మలకు అవసరమైన పుణ్యఫలాలు అందుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ గంగా నదిలో స్నానం చేయాలని ఆరాట పడుతుంటారు.
శరీరాన్ని ... మనసును పవిత్రం చేయడమే కాదు, మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదించేదిగా గంగానది కనిపిస్తుంది. అలాంటి గంగానదిలో స్నానం వలన మరింత విశిష్టమైన ... విశేషమైన ఫలితాలను ఇస్తూ 'మార్గశిర మాసం' ఆరంభమవుతుంది. ఈ మాసం ఆరంభమైన రోజున గంగానదిలో స్నానం చేయడం వలన, అనేక సూర్య గ్రహణ స్నానాలు చేసిన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది.
మాసాలలో మార్గశిర మాసాన్ని తానేనని శ్రీకృష్ణ పరమాత్ముడు సెలవిచ్చాడు. అందువలన ఈ మాసం సాక్షాత్తు విష్ణు స్వరూపమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును సేవించడం వలన కలిగే ఫలితాలు అనంతాలని స్పష్టం చేయబడుతోంది. ఈ మాసం ఆరంభమయ్యే రోజున గంగా స్నానం ... మాసమంతా శ్రీమహావిష్ణువును ఆరాధించడం మరచిపోకూడదు.