సకల శుభాలనిచ్చే సత్యనారాయణస్వామి
వ్రతాలలో సత్యనారాయణస్వామి వ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది. వివాహ వేడుక ... గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగిన తరువాత సత్యనారాయణస్వామి అనుగ్రహాన్ని ఆశిస్తూ, ఆయన వ్రతాన్ని ఆచరించడం ఆచారంగా వస్తోంది. ఇక కొన్ని దేవాలయాలో ప్రతి పౌర్ణమి రోజున సామూహికంగా సత్యనారాయణస్వామి వ్రతాన్ని జరుపుతుంటారు.
ప్రధాన దైవమే సత్యనారాయణస్వామి అయితే వ్రతాలు జరుపుకునే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలా సామూహికంగా సత్యనారాయణస్వామి వ్రతాలు ఎక్కువగా జరిగే దేవాలయాల్లో ఒకటి మనకి రాజమండ్రి - ఆర్యాపురంలో దర్శనమిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో పవిత్రతకు ప్రతీకగా అలరారుతోన్న ఈ ఆలయంలో రమాసహిత సత్యనారాయణస్వామి భక్తులను అనుగ్రహిస్తుంటాడు.
సాధారణంగా సత్యనారాయణస్వామి వ్రతాలు కార్తీకమాసంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే కార్తీకంలో చేసే సత్యవ్రతం వలన లభించే ఫలితం విశేషంగా ఉంటుంది. అందువలన ఈ మాసంలో చాలామంది తప్పనిసరిగా సత్యవ్రతం చేసుకుంటూ ఉంటారు. ఇక ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. సత్యనారాయణస్వామికి తనని గుర్తుపెట్టుకుని పూజించే వాళ్లంటే ఎంతో ప్రీతి. అలాంటి వాళ్లకు ఆయన వెన్నంటి ఉంటాడు. ఎలాంటి కష్టాల నుంచైనా ఎంతో తేలికగా బయటపడేస్తుంటాడు.
సత్యనారాయణస్వామి ఆలయాన్ని దర్శించినా ... ఆయన వ్రతం చేసుకున్నా ... వ్రత కథలు విన్నా ... వ్రత సంబంధమైన అక్షింతలు తలపై వేసుకున్నా ... ప్రసాదాన్ని స్వీకరించినా పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. సత్యదేవుడు ... సత్యం చూపించే దేవుడు కావడం వల్లనే ఆయన ఆలయాలను దర్శించుకునే భక్తుల సంఖ్య ... సత్యవ్రతాలను ఆచరించేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.