ఈ రోజున లక్ష్మీదేవిని ఇలా ఆరాధించాలి
లోక కల్యాణం కోసం శ్రీమన్నారాయణుడు వివిధ అవతారాలను ధరించాడు. అలాగే తనని ఆరాధిస్తోన్న భక్తుల నుంచి దారిద్ర్యాన్నీ ... దుఃఖాన్ని దూరం చేయడానికే లక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా అవతరించింది. అష్టలక్ష్ములలో ఏ లక్ష్మీదేవిని పూజించినా మిగతా లక్ష్ముల అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. ఇది అమ్మవారి చల్లని మనసుకి నిలువెత్తు నిదర్శనం.
తనని విశ్వసిస్తోన్న భక్తుల ఇళ్లలో లేమి అనేది లేకుండా చూడటానికే అమ్మవారు ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవిని కొన్ని విశేషమైన రోజుల్లో పూజించడం వలన లభించే ఫలితం కూడా అలాగే ఉంటుంది. అలాంటి విశేషమైన రోజుల్లో ఒకటిగా కార్తీక బహుళ త్రయోదశి కనిపిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది.
దీపం ... లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది కనుక, దీపలక్ష్మిని ఈ రోజున ప్రార్ధిస్తూ ఉంటారు. వీలైనంత వరకూ పూజకు తామర పూలను వాడటం మంచిది. ఆ రాత్రి ప్రధాన ద్వారం ఎదురుగా అన్నాన్ని చిన్నరాశిగా పోసి దానిపై వెలుగుతోన్న దీపాన్ని వెలిగించాలి. సిరిసంపదల విషయంలో తమకి ఎలాంటి లోటు కలగకుండా చూడమని నమస్కరించాలి.
అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ... ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతూ వెలిగించిన ఈ దీపం వెంటనే కొండెక్కకుండా చూసుకోవాలి. అందుకు అవసరమైన ఏర్పాట్లు ముందేచేసుకోవాలి. ఇక ఈ రోజున బ్రాహ్మణుడికి దీపదానం చేయడం మరచిపోకూడదు. ఈ విధంగా చేయడం వలన యమధర్మరాజు శాంతిస్తాడనీ ... అపమృత్యు భయం తొలగిపోతుందనీ, నరకబాధల బారిన పడకపోవడం జరుగుతుందని స్పష్టం చేయబడుతోంది.