అన్నపురాశిగా మారిపోయిన ఇసుక !

ఒకరోజున వశిష్ఠ మహర్షి దగ్గరికి గౌతామాది మహర్షులు వస్తారు. లోక కల్యాణం కోసం ఆయన వివాహం చేసుకోవలసిన అవసరం ఉందని చెబుతారు. లోక కల్యాణం కోసమని చెప్పడంతో వశిష్ఠ మహర్షి అందుకు అంగీకరిస్తాడు. అందుకు తగిన కన్యను గురించి వశిష్ఠ మహర్షి అడగడంతో, ఆ బాధ్యతను తాను తీసుకుంటున్నట్టుగా చెబుతాడు గౌతమమహర్షి.

ఈ విషయంలో ఆయన కొనసాగించిన అన్వేషణ ఫలిస్తుంది. అరుంధతి కనిపించినప్పుడు ఆయన తన ప్రయత్నం ఫలించిందని అనుకుంటాడు. వశిష్ఠ మహర్షికి అర్ధాంగికాగల అన్ని అర్హతలు ఆమెకి ఉన్నాయని భావిస్తాడు. అరుంధతికి విషయం చెప్పి ఆమెను వెంటబెట్టుకుని వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి తీసుకుని వస్తాడు. అరుంధతి గుణగణాలను గురించి వశిష్ఠ మహర్షికి వివరిస్తాడు. అనునిత్యం అమ్మవారి ఆరాధనలో ఆమె నిమగ్నమై ఉంటుందని చెబుతాడు.

ఆమెని పరీక్షించాలనుకున్న వశిష్ఠమహర్షి, తన శిష్యులంతా ఆకలితో ఉన్నారనీ ... వెంటనే వారి ఆకలి తీర్చమని చెబుతాడు. పొయ్యి దగ్గర ఇసుకతో నిండిన కుండ తప్ప మరేమీ లేకపోవడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. అది తనకి ఆయన పెట్టిన పరీక్షని అర్థమైపోవడంతో, అమ్మవారిని ప్రార్ధిస్తూ ఆ కుండలోని ఇసుకను ఒక పాత్రలో కుమ్మరిస్తుంది. అంతే అమ్మవారి అనుగ్రహంతో ఆ ఇసుక ... అన్నపురాశిగా మారిపోతుంది.

అది చూసిన వశిష్ఠమహర్షి తాను వివాహమాడటానికి ఆమె తగిన కన్యయని అనుకుంటాడు. అరుంధతితో తన వివాహానికి అంగీకారాన్ని తెలియజేస్తాడు. లోక కల్యాణం కోసం తానుపడిన శ్రమ ఫలించిందని గౌతమమహర్షి సంతోషంతో పొంగిపోతాడు. అలా ఒక్కటైన వశిష్ఠ మహర్షి - అరుంధతి లోకంలో ఆదర్శవంతమైన దంపతులుగా నిలిచిపోయారు.


More Bhakti News