విజయాన్ని అందించే ఆంజనేయుడి ఆరాధన !
జీవితంలో ఎదుగుదలనే ప్రతిఒక్కరూ కోరుకుంటారు ... అందుకోసం ఎంతగానో కృషిచేస్తుంటారు. అయితే కొంతమంది ఆ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ స్థానం నుంచి పక్కకి తప్పించడానికి తమ తెలివితేటలను ఉపయోగిస్తుంటారు. మానసికంగా దెబ్బతీసి .. విజయం గురించిన ఆలోచన లేకుండా పథకాలు వేస్తుంటారు.
ఇలా ఏర్పడిన శత్రువర్గాన్ని ఎదిరిస్తూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం కష్టమైన పనే. అలాంటివాళ్లు ఆంజనేయస్వామిని ఆరాధించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుంది. శత్రుబాధలు తప్పించి వాళ్లపై విజయాలను సాధించడానికి ఆంజనేయస్వామి అండదండగా నిలుస్తాడు. తనపై శ్రీరాముడు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి హనుమంతుడు చేసిన కృషి సామాన్యమైనది కాదు.
ఆలాగే రాముడికి సహాయంగా తమ సేన ఉందని చెబుతూ ఆ సేన ఎంత బలమైనదో సీతమ్మకి అర్థం కావడం కోసం తన స్థూల రూపం చూపుతాడు. ఇక తన ఒక్కడి బలమే ఇలా ఉంటే, తన వాళ్లంతా లంకలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందనేది తలచుకుంటేనే రావణసేనకు భయం కలిగేలా నానాబీభత్సాన్ని సృష్టిస్తాడు. అక్కడి నుంచి తరిగి వచ్చి రావణుడి బలం ... బలహీనతలను గురించి రాముడికి తెలియజేస్తాడు.
రావణుడిపై రాముడు విజయం సాధించడంలో హనుమంతుడు కీలకమైన పాత్రను పోషిస్తాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడి రథానికి గల జెండాపై 'కపిరాజు' గా హనుమంతుడు ఉండటం వల్లనే వాళ్లని విజయం వరించిందని అంటారు. అందుకే విజయాన్ని ప్రసాదించే దైవంగా హనుమంతుడిని చెబుతుంటారు. శత్రువుల పాచికలు పారకుండా చేస్తూ విజయాలను సాధిస్తూ ముందుకు వెళ్లాలనుకునే వాళ్లు హనుమంతుడిని పూజించడం మరిచిపోకూడదు.