అభయాన్నిచ్చి ఆదుకునే ఆంజనేయుడు
పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకునే దైవంగా ... ఆదుకునే దైవంగా ఆంజనేయుడు కనిపిస్తాడు. ఆంజనేయస్వామి ఎక్కడ ఉంటే అక్కడ ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ఉంటాయి. దుష్టశక్తులు ... దుష్ట ప్రయోగాలు తమ శక్తిని కోల్పోతాయి.
ఇక ఎలాంటి గ్రహాదోషాలైనా ఆంజనేయస్వామి ఆరాధకులకు దూరంగా ఉంటాయి. అందువల్లనే ప్రతి గ్రామంలోను ఆంజనేయస్వామి ఆలయమో ... మందిరమో తప్పకుండా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వయంభువు ఆంజనేయస్వామి ఆలయాలు ... ప్రాచీనకాలంనాటి ఆలయాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటాయి.
అలాంటి ఆలయాలలో ఒకటి 'హనుమంతుల గూడెం' లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం పరిధిలో ఈ ఆలయం కొలువై ఉంది. ఇక్కడ ఆవిర్భవించిన హనుమంతుడికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు. ముందుగా స్వామివారే ఇక్కడ ఆవిర్భవించాడనీ, ఆ తరువాతే గ్రామం ఏర్పడిందని అంటారు. ఈ కారణంగానే ఈ గ్రామానికి హనుమంతులగూడెం అనే పేరు వచ్చిందని చెబుతారు.
సాధారాణంగా మానసికపరమైన ... శారీరకపరమైన అనారోగ్యలకి లోనైన వాళ్లు హనుమంతుడి ఆలయాలకి వస్తుంటారు. అలాంటివారికి కావలసింది మానసిక ప్రశాంతత. అది ఈ క్షేత్రంలో కావలసినంత లభిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో గల ఈ ఆలయాన్ని దర్శిస్తే ఇక్కడి నుంచి కదలాలనిపించదు. అంతటి ప్రకృతి రమణీయత ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది.
ప్రతి మంగళ - శని వారాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి స్వామిని అంకితభావంతో పూజిస్తే సమస్యలన్నీ తొలగిపోయి సకల శుభాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామికి సిందూరాభిషేకాలు ... ఆకుపూజలు చేయిస్తూ తరిస్తుంటారు.