ఆడపడచులను ఆదుకునే ఎల్లమ్మతల్లి

సాధారణంగా పండుగల సందర్భాల్లో ఎవరైనా తమ కూతురు కుటుంబాన్ని ఆహ్వానించి, ఆ పండుగ రోజున వారికి కొత్తబట్టలు ... కానుకలు కొనిపెట్టి సంతోషపెడుతుంటారు. కూతురు కుటుంబం ఆనందంగా ఉంటే తాము సంతోషంగా ఉన్నట్టేనని భావిస్తుంటారు.

ఇక గ్రామదేవతకు సంబంధించిగానీ, గ్రామంలోని దైవానికి సంబంధించిగాని ఏదైనా ఉత్సవం జరుగుతున్నా అత్తవారింట వున్న ఆడపిల్లను తప్పకుండా తీసుకువస్తుంటారు. దైవదర్శనం చేయించి చీరసారెలు పెట్టి సాగనంపుతుంటారు. ఈ విధంగా చేయడం వలన ఆ దైవం యొక్క అనుగ్రహం ఆ ఊరి ఆడపడచులపై ఉంటుందని విశ్వశిస్తుంటారు.

అలాంటి నమ్మకాన్ని బలంగా కలిగిన గ్రామంగా 'దర్వేశిపురం' కనిపిస్తుంది. ఈ గ్రామం నల్గొండ జిల్లా కనగల్ మండలం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి 'ఎల్లమ్మతల్లి' ఆలయాన్ని గురించి తెలియనివాళ్లు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండరు. ఎల్లమ్మతల్లిని అంతా తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ ఉంటారు. పాడిపంటలను రక్షించే దేవతగా కొలుస్తుంటారు.

వివాహమై ఈ గ్రామం నుంచి వెళ్లిన ఆడపిల్లలు ఏ ఊళ్లో వున్నా అమ్మవారి ఉత్సవాలకి తప్పనిసరిగా రావడమనేది తరతరాలుగా వస్తోన్న ఆచారంగా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అమ్మవారిని చూస్తూ పెరగడం వలన, అమ్మవారికి కూడా తమని చూడాలనిపిస్తుందనే ఆలోచన వలన తప్పకుండా ఇక్కడికి వస్తుంటారు. తమ భర్తను ... పిల్లలను అమ్మవారికి చూపించి ఆశీస్సులు అందించమని కోరతారు. ఎక్కడ వున్నా ఎల్లవేళలా తమని ఆదుకోమని ప్రార్ధిస్తుంటారు.

ఆయురారోగ్యాలు ... సంతాన సౌభాగ్యాలను కోరుతూ అమ్మవారికి మొక్కుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కోరికలు నెరవేరినవారు, ఆ తల్లికి తలనీలాలను సమర్పిస్తుంటారు. ఈ క్షేత్రంలో తలనీలాలను సమర్పించే భక్తుల సంఖ్యను చూస్తే, అమ్మవారి మహాత్మ్యం ఎలాంటిదో ... భక్తులను ఆ తల్లి ఎంతగా అనుగ్రహిస్తుందనేది అర్థమైపోతుంది.


More Bhakti News