పాపానికి ఫలితం అనుభవించవలసిందేనా ?

పాపమంటూ చేసిన తరువాత దాని ఫలితం పాముకన్నా వేగంగా వెంటాడుతూ ఉంటుంది. ఎంతటివారైనా దీనికి అతీతులు కాకపోవడం విశేషం. ఇందుకు ఒక ఉదాహరణగా దశరథ మహారాజు గురించి కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి దశరథ మహారాజు వేటకి వెళతాడు. మృగాన్ని వేటాడనిదే వెనుదిరిగి వెళ్లకూడదనే ఉద్దేశంతో పట్టుదలగా ముందుకి సాగుతుంటాడు.

అలా కొంతదూరం వెళ్లాక ఒక యేటి ఒడ్డున ఏదో అలికిడి అయినట్టుగా అనిపించడంతో, దాహం తీర్చుకోవడానికి మృగం వచ్చి ఉంటుందని భావించి బాణాన్ని సంధిస్తాడు. బాధతో మనిషి అరిచినట్టు అనిపించడంతో కంగారుగా దగ్గరికి వెళ్లి చూస్తాడు. బాణం దిగబడటంతో బాధతో ఒక ముని కుమారుడు విలవిలలాడిపోతుండటం చూసి నివ్వెరపోతాడు.

అంధులైన తన తల్లిదండ్రుల దాహం తీర్చమని చెప్పి ఆ ముని కుమారుడు తన ప్రాణాలను వదులుతాడు. ఆకులను పాత్రగా మలిచి అందులో నీరు తీసుకుని, ఆ ముని కుమారుడు చూపించిన వైపు వెళతాడు దశరథుడు. జరిగినదానికి అతను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. నీళ్లు తీసుకువచ్చినది తమ కుమారుడు కాదని గ్రహించిన ఆ తల్లిదండ్రులు, తమ శ్రవణ కుమారుడి గురించి ఆదుర్దాగా అడుగుతారు.

తన వలన జరిగిన పొరపాటును గురించి వాళ్లకి వివరిస్తాడు దశరథుడు. కుమారుడి మరణవార్త విన్న ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. తమ కడుపుకోతకి కారణమైన అతను కూడా పుత్రశోకాన్ని అనుభవించక తప్పదని శపించిన ఆ వృద్ధ దంపతులు తమ చివరిశ్వాస విడుస్తారు. ఆ తరువాత కాలంలో దశరథుడి కుమారుడైన శ్రీరాముడు వనవాసానికి వెళ్లవలసి వస్తుంది. ప్రాణాలన్నీ రాముడిపైనే పెట్టుకున్న దశరథుడు, అతను దూరమైపోవడాన్ని తట్టుకోలేక పుత్రశోకంతోనే ప్రాణాలు విడుస్తాడు.


More Bhakti News