ఆవేశపడటం వలన కలిగే ఫలితం అనర్థమే !
ధర్మరాజుని జూదానికి ఆహ్వానించి ... జూదంలో అతణ్ణి ఓడించి రాజ్యం దక్కకుండా చేయాలనే ఆలోచన శకుని కారణంగా కౌరవులకు కలుగుతుంది. అయితే ఈ విషయంగా ధర్మరాజు దగ్గరికి ఎవరు వెళ్లి ఆహ్వానం పలికినా పాండవులకు అనుమానం కలిగే అవకాశం ఉంది కనుక, ఎవరిని పంపించాలనే విషయంగా తర్జనభర్జనలు పడతారు.
పాండవులకు సందేహం రాకూడదంటే 'విదురుడు' ని పంపాలని నిర్ణయించుకుంటారు. తమ దురుద్దేశం విదురుడికి కూడా తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతూ ధృతరాష్ట్రుని ద్వారా అతణ్ణి దూతగా పంపిస్తారు. పెద్దల పట్ల ధర్మరాజుకి గల వినయ విధేయతలు ... జూదానికి ఎవరు ఆహ్వానించినా తిరస్కరించనంటూ ఆయన పెట్టుకున్న నియమం ఇక్కడ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి.
దాంతో శకుని ... దుర్యోధనుడు కలిసి పన్నిన పన్నాగం ఫలిస్తుంది. జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం ... అజ్ఞాతవాసం చేయవలసిందేనని కౌరవులు పట్టుపడతారు. అక్కడే ఉన్న విదురుడికి వాళ్ల దురుద్దేశం ఏమిటనేది అర్థమవుతుంది. దాంతో ఆయన పాండవుల తరఫున నిలిచి కౌరవులను నిలదీస్తాడు. వాళ్ల శౌర్యపరాక్రమాలను గురించి ప్రస్తావిస్తాడు.
పాండవుల సహనానికి కారణం వాళ్ల సంస్కారమేనని అంటాడు. బలమైనవారితో విరోధం భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుందని మందలిస్తాడు. మనసు మార్చుకుని పాండవుల విషయంలో న్యాయబద్ధంగా వ్యవహరించమనీ, లేదంటే అది ప్రళయాన్ని తలపించే యుద్ధానికి దారితీస్తుందని కూడా హెచ్చ రిస్తాడు.
అతను పాండవ పక్షపాతి కనుక అలా మాట్లాడుతున్నాడని భావించిన కౌరవులు అయన హిత వాక్కులను కొట్టిపారేస్తారు. తాము ఏదైతే చేయాలని అనుకున్నారో అదే చేస్తూ వెళతారు. ఫలితంగా విదురుడు చెప్పినట్టుగానే కౌరవ పాండవుల మధ్య గొడవ కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తుంది. దుర్యోధనుడితో పాటు అతని సోదరులంతా ప్రాణాలను కోల్పోతారు. అందుకే సత్పురుషుల సూచనలను ఆచరించాలనీ ... ఆవేశం అనర్థాలకి దారితీస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.