అద్భుతమైన తేజస్సు ఈ శివలింగం సొంతం

కార్తీకమాసంలో శివాలయాలను దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాజులు ...మహర్షులు ... దేవతలచే ప్రతిష్ఠించబడిన శివలింగాలను దర్శించినప్పుడు కలిగే ఆనందం ... అనుభూతి వేరు. అలాంటి శివలింగాలలో కొన్ని మహాతేజస్సును సంతరించుకుని కనిపిస్తాయి.

ఏదో తెలియని శక్తి ఆ శివలింగం పైనుంచి చూపు మరల్చలేకుండా చేస్తుంటుంది. ఆ కాసేపట్లోనే ఆ దేవదేవుడితో విడదీయరాని అనుబంధం ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. ఇంతకాలం ఈ శివలింగ దర్శనం చేసుకోకుండా ఎలా ఉన్నామనే భావన కలుగుతుంది. అలా తొలిచూపుతోనే మనసు వేదికపై నిలిచిపోయే శివలింగం మనకి 'మార్కండేయ పురం' లో కనిపిస్తుంది.

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో మహాదేవుడు ... మార్కండేయస్వామి పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. మృకండ మహర్షి ప్రతిష్ఠించిన ఈ శివలింగం ... ఆయన కుమారుడైన మార్కండేయుడితోను పూజాభిషేకాలు అందుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికీ ... స్వామివారికి ఈ పేరు వచ్చిందని అంటారు. కార్తీకమాసంలో ఇక్కడ జరిగే లక్ష పుష్పార్చనలు ... లక్ష బిల్వార్చనలు చూసితీర వలసిందే.

ఈ క్షేత్రాన్ని ఒక సర్పరాజం రక్షిస్తూ ఉంటుందనీ ... అప్పుడప్పుడు ఆలయ ప్రాంగణంలో దాని బుసలు వినిపిస్తూ ఉంటాయని చెబుతుంటారు. ఇక్కడి శివలింగం మహా తేజస్సుతో వెలుగొందుతూ ఉండటానికీ ... సర్పరాజం స్వామివారిని సదా కనిపెట్టుకుని ఉండటానికి గల కారణం స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉండటమేనని అంటారు. కార్తీకమాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన కలిగే పుణ్యఫలితాలు జన్మజన్మలపాటు వెంట వస్తాయని విశ్వసిస్తుంటారు.


More Bhakti News