కష్టాలను తీర్చేటి వేంకటేశ్వరుడు
ఉదయాన్నే వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినగానే కలిగే ఆనందం వేరు ... అనుభూతి వేరు. లోక కల్యాణకారకుడైన స్వామి నిద్రలేచిన తరువాత ఎవరు మాత్రం మంచంపై ఉండగలరు ? అందుకే వెంటనే నిద్రలేచి చకచకా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించడం జరుగుతూ ఉంటుంది.
వ్యాధులు ... బాధలు ... కష్టాలు .. సమస్యలు ఇలాంటివి ఎన్ని ఉన్నా, వేంకటేశ్వరస్వామి చిరుమందహాసంతో కూడిన మోము చూసిన తరువాత అవేవీ గుర్తుకురావు. ఆయన దర్శనం చేసుకున్న తరువాత కనుచూపుమేరలో అవి కనిపించవు. అందుకే అనేక ప్రాంతాలలో ఆ స్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు.
అలా భక్తజనులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలలో ఒకటి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దర్శనమిస్తుంది. పెద్దబజార్ లో గల ఈ ఆలయం ఈ ప్రాంతంలో గల ప్రాచీన ఆలయమని చెబుతుంటారు. గర్భాలయంలో స్వామివారు శ్రీదేవి ... భూదేవి సమేతుడై దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి సౌందర్యం చూసినప్పుడు కలిగే సంతోషం ముందు అన్ని ఆనందాలు అల్పమైనవిగానే కనిపిస్తాయి.
సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించబడిన ఈ ఆలయం భక్తజన సందోహంతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. పర్వదినాలలోను ... ధనుర్మాసంలోను స్వామివారికి ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతుంటాయి. కనువిందుచేసే ఇక్కడి వేంకటేశ్వరుడు కష్టాల నుంచి గట్టెక్కించడంలో ఎంతమాత్రం ఆలస్యం చేయడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.