సీతమ్మవారి పాదముద్రను స్పర్శిస్తే చాలు !
వివిధ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ కొన్ని పాదముద్రలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ పాద ముద్రలను గురించి కొన్ని ఆసక్తికరమైన కథనాలు అక్కడ వినిపిస్తూ ఉంటాయి. ప్రధాన దైవం మొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు ఏర్పడిన పాదముద్ర అనీ, ఫలానా దైవం ఈ ప్రదేశం మీదుగా వెళుతూ విశ్రాంతి కోసం ఇక్కడ ఆగడం వలన ఏర్పడిన పాదముద్ర అని చెబుతుంటారు.
ఈ నేపథ్యంలో ఆయా క్షేత్రాలను బట్టి అక్కడ వేంకటేశ్వరస్వామి ... నరసింహస్వామి ... రాముడు ... హనుమంతుడు వంటి వారి పాదముద్రలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఒక క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ సీతమ్మవారి పాదముద్ర కనిపిస్తుంది. అనంతపురం జిల్లాకి చెందిన ఆ క్షేత్రమే 'లేపాక్షి'. అనేక విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక కేంద్రంగా లేపాక్షి అలరారుతోంది.
అలాంటి ఈ క్షేత్రంలో ఒకచోట సీతమ్మవారిదిగా చెప్పబడుతోన్న పాదముద్ర కనిపిస్తుంది. ఇలాంటి పాదముద్రలు చాలా క్షేత్రాల్లో కనిపిస్తుంటాయి. అయితే ఈ పాదముద్ర యొక్క బొటనవ్రేలు భాగం నుంచి నిరంతరం సన్నని నీటిధార వస్తుండటం విశేషం. మండువేసవిలో సైతం ఈ నీటిధార ఆగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.
సీతమ్మవారి పాదముద్రను తాకి ఆ తల్లి ఆశీస్సులు తీసుకున్నట్టుగా భక్తులు భావిస్తుంటారు. ఆ నీటిని స్పర్శించినా ... తలపై చల్లుకున్నా ... తీర్థంగా స్వీకరించినా పాపాలు నశిస్తాయని విశ్వసిస్తుంటారు. రాముడి వెంట వనవాసానికి బయలుదేరిన సీతమ్మ ఎన్నో ప్రాంతలమీదుగా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. ఆ తల్లి పాదస్పర్శచే ఈ నేల పునీతమైంది. అలాంటి సీతమ్మవారి పాదముద్రను పదిలంగా తన గుండెల్లో దాచుకుని, దర్శించిన భక్తులను ధన్యులను చేస్తోన్న ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూసితీరవలసిందే.