కార్తీక అమావాస్య రోజున లక్ష్మీపూజ !

కార్తీకమాసంలో తులసితో శ్రీమహావిష్ణువును ... బిల్వదళాలతో శివుడినీ ... కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ మాసంలో చేసే పూజలు ... నోములు ... వ్రతాలు ఆశించిన దానికంటే అధిక ఫలితాలను ఇస్తుంటాయి.

కార్తీక మాసంలో భగవంతుడిని ఆరాధించే అవకాశాన్ని వదులుకోకూడదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే కార్తీక బహుళ అమావాస్య కూడా పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారని అంటారు. పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్లు ఈ విషయాన్ని మరిచిపోకూడదు.

ఇక కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ ... వైష్ణవ ఆలయంలోను దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చెప్పట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది.

కార్తీక అమావాస్య 'కమలాజయంతి' గా చెప్పబడుతోంది కనుక అంతా తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన ఈ రోజున అంకితభావంతో ఆరాధించడం వలన ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News