కలలో దీపం కనిపిస్తే కలిగే ఫలితం !

చీకటి భయాన్ని కలిగిస్తుంది ... వెలుగు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది ... దారి చూపుతూ ముందుకు నడిపిస్తుంది. చీకటిని ఆశ్రయించి అనేక దుష్టశక్తులు ... విషకీటకాలు ఉంటాయి. అందువలన చీకట్లోకి వెళ్లాలంటే మరో కొత్తలోకంలోకి అడుగుపెడుతున్నట్టుగా భయపడుతూ ఉంటారు.

దీపాన్ని వెలిగించినదే తడవుగా ఆ వెలుగు చీకటిని తరిమికోడుతుంది. దుష్టశక్తులు ఆ వెలుగును భరించలేక దూరంగా పారిపోతాయి. అందుకే సూర్యోదయానికి ముందు ... తరువాత దీపం వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. అలాంటి దీపం .. కలలో కనిపించే అవకాశం లేకపోలేదు. కలలో ఏవి ఎందుకు కనిపిస్తాయనేది ఎవరికీ తెలియదు. అందుకే వాటి ఫలితాలను తెలుసుకోవడానికి అంతా ఆసక్తిని చూపుతుంటారు.

చీకటిని చీలుస్తూ దీపం వెలగడం ... ఆ వెలుగుతో పరిసరాలు కాంతివంతం కావడం ... తనలో సంతోషం వికసించడం కలలో కనిపిస్తూ ఉంటుంది. అద్భుతంగా అనిపించే ఈ దృశ్యం మనోఫలకంపై అలా గుర్తుండిపోతుంది. మెలకువ వచ్చిన తరువాత ... ఎందుకు ఆ కల వచ్చిందో తెలుసుకోవాలనే ఆతృత కలుగుతుంది. దీపం వెలిగించడం ఎంతటి శుభప్రదమో ... కలలో దీపం కనిపించడం కూడా అంతే మంచిదని చెప్పబడుతోంది.

కొత్త ఆశలు ఫలిస్తాయనడానికి ... కొత్త జీవితం ఆరంభమవుతుందన డానికి ... శుభానికి సంకేతంగా దీపం చెప్పబడుతోంది. దీపం లక్ష్మీదేవి స్వరూపం ... సమస్త శుభకార్యాలు దీపం వెలిగించడంతోనే ఆరంభమవుతాయి. సకల దోషాలు దీపం వెలిగించడంతోనే తొలగిపోతాయి. అలాంటి దీపం కలలో కనిపించడాన్ని శుభపరిణామాలకు సంకేతంగా భావించవచ్చని చెప్పబడుతోంది.


More Bhakti News