విజయాన్ని సాధించడానికి కావలసినది ఇదే !
ఏ రంగంలోనైనా విజయ శిఖరాలను అందుకోవాలంటే ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఇక ఒక స్థాయికి చేరుకున్న తరువాత ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి అంతకన్నా ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. ఈ ప్రయాణంలో ఎలాంటి వ్యామోహాలకి లోనైనా చేరుకోవలసిన గమ్యం దూరమైపోతుంది. ఆశించిన ఫలం అందకుండానేపోతుంది.
అందుకే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగినవాళ్లనే విజయాలు వరించాయనే విషయం పురాణాల్లోను ... ఇతిహాసాలలోను కనిపిస్తుంది. అందుకు ఒక ఉదాహరణగా అర్జునుడి గురించి కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి దేవేంద్రుడి ఆహ్వానం మేరకు అర్జునుడు దేవలోకానికి వెళతాడు. దేవతల కోరిక మేరకు దానవులతో పోరాడి వాళ్లను పరాజితులను చేస్తాడు. దేవతలకు విజయాన్ని చేకూర్చి పెట్టిన అర్జునుడిపై దేవలోకం ప్రశంసలు కురిపిస్తుంది.
అర్జునుడి సమ్మోహన రూపం ... ఆయన శౌర్యపరాక్రమాలు చూసిన 'ఊర్వశి' మనసు పారేసుకుంటుంది. అర్జునుడు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆయనని సమీపించి ఆయన పట్ల తనకి గల భావాన్ని ఆవిష్కరిస్తుంది. అతని వంటి పుత్రుడిని ప్రసాదించమని మనసులోని మాట చెబుతుంది. తన వంటి పుత్రుడిని ఆమె పొందవలసిన పనిలేదనీ, ఎందుకంటే ఆ క్షణం నుంచి తాను ఆమెకి పుత్రుడనేనని అంటాడు అర్జునుడు.
అతని మాట .. మనసు .. చూపు ఒకే భావాన్ని వ్యక్తం చేయడంతో ఊర్వశి బిత్తరపోతుంది. చూపుమరల్చుకోలేని తన దేవలోక సౌందర్యం పట్ల అర్జునుడు ఆకర్షితుడు కాకపోవడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయనకి గల ఇంద్రియ నిగ్రహాన్ని మనసులో అభినందించకుండా ఉండలేకపోతుంది. అర్జునుడు అన్ని విజయాలను సాధించడానికీ ... విజయుడు అనే పేరుతో పిలవబడటానికి కారణం అతని ఇంద్రియ నిగ్రహమేనని గ్రహిస్తుంది. అయితే తనని తిరస్కరించాడనే కోపంతో ఆమె అర్జునుడికి ఇచ్చిన శాపం కూడా అజ్ఞాతవాస సమయంలో ఆయనకి వరమే అవుతుంది.