కన్నవారిని ప్రేమిస్తే కరుణించే దేవుడు
కుక్కుట మహాముని తపోబల సంపన్నుడు. దైవారాధన ... తల్లిదండ్రుల సేవ మినహా ఆయనకి మరి దేనిపైనా ధ్యాస ఉండేది కాదు. ఆ పవిత్రత కారణంగా ఆయన ఆశ్రమంలోకి ఎలాంటివారు అడుగుపెట్టినా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతుండేవారు.
నిరంతరం తల్లిదండ్రులను సేవించే ఆయనని దర్శించినా చాలని దేవతలు భావించే వాళ్లు. ఇక గంగ .. యమున .. సరస్వతి అనునిత్యం ఆయన ఆశ్రమాన్ని దర్శిస్తూ మరింత పవిత్రతను పొందుతూ ఉండేవారు. అలాంటి ఆశ్రమం దిశగా ఒకసారి పుండరీకుడు వస్తాడు.
కుక్కుట మహాముని ఆశ్రమంలో గంగ తదితరులు తిరుగాడుతుండటాన్ని కాముకుడైన పుండరీకుడు చూసి లోపలికి ప్రవేశిస్తాడు. అక్కడ అతివలెవరూ లేకపోవడంతో, కుక్కుట మహామునియే వాళ్లని దాచి ఉంటాడని భావించి అహంభావంతో దాడిచేయబోతాడు. ఫలితంగా అతని రెండు కాళ్లు పడిపోతాయి.
తన తండ్రికి తాను చేస్తోన్న పాదసేవకి భంగం కలిగించినందుకే అతనికి అలా జరిగిందని చెబుతాడు కుక్కుట మహాముని. తనని పూజించకపోయినా ... సేవించకపోయినా భగవంతుడు బాధపడడనీ, తల్లిదండ్రులను ఆదరించనివారిని ఆయన తన సమీపానికి కూడా రానీయడని అంటాడు. కన్నవాళ్ల మనసుకు కష్టం కలిగించినవారిని కన్నెత్తి చూడటానికి కూడా భగవంతుడు ఇష్టపడడని అంటాడు.
తల్లిదండ్రులకు సేవ చేసిన వాళ్లను మాత్రమే భగవంతుడు ప్రేమిస్తాడని చెబుతాడు. అలాంటి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించి ... భగవంతుడిని మెప్పించి ఉత్తమగతులను పొందమని సెలవిస్తాడు. దాంతో పుండరీకుడికి జ్ఞానోదయమవుతుంది. కుక్కుట మహాముని చెప్పినట్టుగానే తల్లిదండ్రులను పూజిస్తూ ... పాండురంగడిని సేవిస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటాడు.