కాముడి కారణంగానే ఈ పేరు వచ్చిందట !

అష్టాదశ శక్తిపీఠాల్లో 'కామాఖ్య దేవి' శక్తి పీఠం ఒకటిగా విలసిల్లుతోంది. అమ్మవారి యోని భాగం ఇక్కడ పడినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి అమ్మవారిని 'కామాఖ్యదేవి' గా ... కామరూపాదేవిగా భక్తులు కొలుస్తుంటారు. ఈ శక్తి పీఠానికి ఈ పేరు రావడానికి వెనుక పురాణపరమైన కథనం వినిపిస్తుంది.

మన్మథుడిని కాముడు అని కూడా పిలుస్తుంటారు. సతీదేవి వియోగాన్ని అనుభవించిన శివుడు ఆ తరువాత తపస్సులోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలోనే తండ్రి ఆదేశం మేరకు సదాశివుడికి పార్వతీదేవి సేవలు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే శివుడి యొక్క తేజస్సుతో జన్మించినవాడు తప్ప తనని మరెవరూ సంహరించకుండా తారకాసురుడు వరాన్ని పొందుతాడు.

దాంతో కంగారుపడిపోయిన దేవతలు, లోక కల్యాణం కోసం శివుడికి వివాహం జరగాలని కోరుకుంటారు. ముందుగా ఆయన తపస్సు నుంచి బయటికి రావాలి ... తనకి సేవలు చేస్తోన్న పార్వతిని చూడగానే ఆయన మనసు చలించాలి. అప్పుడే ఆయన వివాహం వైపు మొగ్గుచూపేలా చేయగలమని అంతా అనుకుంటారు. ఈ కార్యభారాన్ని మన్మథుడికి అప్పగిస్తారు.

ఇక్కడి 'నీలాచలం'పైనుంచే మన్మథుడు శివుడిపైకి పంచబాణాలను ప్రయోగిస్తాడు. కాముడు వేసిన బాణాల ప్రభావం వలన పరమశివుడి మనసు చలిస్తుంది. దాంతో ఆయన అందుకు కారణమైన మన్మథుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. ఆ తరువాత విషయం తెలుసుకుని శాంతిస్తాడు. రతీదేవి అభ్యర్థనతో కాముడికి అదృశ్య రూపంలో సంచరించే అవకాశాన్ని కల్పిస్తాడు.

లోక కల్యాణం కోసం కాముడు సాహసించినదీ ... తన దేహాన్ని కోల్పోయి అదృశ్య రూపాన్ని పొందినది ఈ ప్రదేశంలోనే. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి కామరూప క్షేత్రామనే పేరు వచ్చిందనీ, ఇక్కడ ఆవిర్భవించిన అమ్మవారు కూడా కామరూపాదేవిగా పిలవబడుతోందని అంటారు.


More Bhakti News