భగవంతుడికి కావలసింది భక్తుల సంతోషమే

శ్రీమహావిష్ణువు లీలా విశేషాలు అన్నీ ఇన్నీ కావు. లోక కల్యాణం కోసం అనేక అవతారాలను ధరించిన ఆయన, తన భక్తుల సంకల్పం నెరవేరడానికిగాను వివిధ రూపాలను కూడా ధరించాడు. తనని ఆరాధించే భక్తులను కనిపెట్టుకునుండే ఆయన, వాళ్లకి అవసరమైన సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాడు.

అలా ఆయన ఒక భక్తురాలి కోసం బ్రహ్మచారి రూపాన్ని ధరించి ఆమెకి సంతోషాన్ని కలిగించిన కథనం మనకి ఒక క్షేత్రంలో వినిపిస్తుంది. నూటాఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందిన ఆ క్షేత్రం పేరే 'తిరువల్లవాళ్'. కేరళ ప్రాంతానికి చెందిన ఈ దివ్య క్షేత్రంలో స్వామివారు 'వల్లపి రాన్' పేరుతోను ... అమ్మవారు సెల్వత్తిరుక్కొళుందు తాయారు పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రంలో స్వామివారు ప్రదర్శించిన ఒక లీలావిశేషాన్ని గురించి ఇక్కడి భక్తులు ఆసక్తికరంగా చెప్పుకుంటూ ఉంటారు.

అనునిత్యం స్వామివారిని అంకితభావంతో సేవించే ఒక భక్తురాలు, ఏకాదశి వ్రతాన్ని ఎంతో నియమనిష్టలతో ఆచరిస్తూ ... ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టేదట. ఏకాదశి వ్రత మహాత్మ్యం మాటల్లో చెప్పలేనిది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వలన, సాక్షాత్తు ఆయనని ప్రత్యక్షంగా సేవించిన ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.

అందుకు నిదర్శనంగా ... ఆమె భక్తిశ్రద్ధలకు మురిసిపోయిన స్వామి, ఏకాదశి రోజున తానే బ్రహ్మచారి రూపంలో ఆమె ఇంటికి వెళ్లి భోజనం చేసేవాడట. ఈ కారణంగానే ఇది మహిమాన్వితమైన క్షేత్రమనీ, ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని అంటారు.


More Bhakti News