ఈ రోజున శివపంచాక్షరి స్తోత్రం పఠించాలి !
మహాశివుడి ఆరాధనా ఫలితాన్ని అధికంగా అందించే విశేషమైన రోజుల్లో 'మాసశివరాత్రి' ఒకటి. ఈ రోజున సదాశివుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన ఆశించిన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీకంలో వచ్చే మాసశివరాత్రి మరింత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది.
మాసశివరాత్రి మహాశివుడికి మహా ప్రీతికరమైనదని అంటారు. సాయం సమయంలో సదాశివుడు కైలాసంలో ఆనందతాండవం చేస్తూ ఉంటాడు కనుక, ఈ సమయంలో చేసే పూజ వలన విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఆనందోత్సాహాలతో స్వామి నాట్యం చేసే సమయంలో ఎవరైతే ఆయనని అర్చిస్తారో, అలాంటివారికి లభించే ఫలితాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో భక్తిశ్రద్ధలతో శివుడిని అభిషేకించి ... బిల్వదళాలతో అర్చించాలి. శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ఆయన సన్నిధిలో దీపం వెలిగించాలి.
మాస శివరాత్రి రోజున ఉపవాస దీక్షను చేపట్టాలి ... సదాశివుడి నామస్మరణతోను ... భజనలతోను జాగరణ చేయాలి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ రోజున 'శివపంచాక్షరి స్తోత్రం' పఠించాలి. వీలైనన్ని ఎక్కువమార్లు ఈ స్తోత్రాన్ని పఠించడం వలన సమస్త దోషాలు నశిస్తాయి ... పాపాలు పటాపంచలవుతాయి ... ముందుజన్మలకి అవసరమైన పుణ్యఫలాలు కలుగుతాయి.