కోరినవి ప్రసాదించే కామధేనువు

వశిష్ఠ మహర్షి ... అరుంధతి లోకానికి ఆదర్శంగా నిలిచిన పుణ్యదంపతులు. వశిష్ఠ మహర్షి ఎంతటి తపోశక్తి సంపన్నుడో ... పాతివ్రత్యంలో అరుంధతి అంతటి శక్తి సంపన్నురాలు. దైవారాధనలో వారి ఆశ్రమ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంటుంది.

వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు. అందుకోసం వశిష్ఠ మహర్షి ప్రయత్నాలను అడ్డుకోవడానికి నానాప్రయత్నాలు చేస్తుంటాడు. అయినా అవేవీ ఆయన తపోశక్తిముందు నిలవలేకపోతుంటాయి. దాంతో దేవేంద్రుడు ఆ ప్రాంతంలో కరవు కాటకాలను సృష్టిస్తాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు.

వాళ్ల ఆకలి బాధను చూడలేకపోయిన అరుంధతి, ఆ బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని అమ్మవారిని కోరుతుంది. ధర్మాన్ని ఆశ్రయించిన వారు ... పతిసేవయే పరమార్థంగా భావించేవాళ్లు పిలిస్తే అనుగ్రహించడానికి అమ్మవారు ఆలస్యం చేయదు. చల్లని మనసున్న ఆ తల్లి వెంటనే అరుంధతి ఎదుట ప్రత్యక్షమై ఆమెకి ఒక కామధేనువును ప్రసాదిస్తుంది.

కావలసినవాటిని కోరుతూ ఆ కామధేనువును ప్రార్ధిస్తే అవి వెంటనే సమకూరతాయని ఆ తల్లి సెలవిస్తుంది. సంతోషంతో అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్న అరుంధతి ... ఆ కామధేనువును ప్రార్ధించి ఆశ్రమంలోని అందరి ఆకలిని తీరుస్తుంది. ఉద్దేశ పూర్వకంగా తమని ఇబ్బందిపెట్టడం కోసం దేవేంద్రుడు సృష్టించిన కరవుకు, కామధేనువుతో అరుంధతి సమాధానం చెబుతుంది.


More Bhakti News