లేపాక్షి క్షేత్రంలోని విశేషం ఇదే !
శైవ సంబంధమైన కొన్ని క్షేత్రాలకి వెళ్లినప్పుడు ముందుగా గణపతిని దర్శించి ఆ తరువాత శివుడిని దర్శించుకోవాలనే నియమం కనిపిస్తుంది. తాము ఆ క్షేత్రానికి వచ్చినట్టుగా ముందుగా గణపతికి కనిపించాలని చెబుతుంటారు. అలాగే మరి కొన్ని క్షేత్రాల్లో తాము దర్శనం కోసం వచ్చామనే విషయాన్ని నందీశ్వరుడి ద్వారా స్వామికి తెలపాలానే ఉద్దేశంతో ముందుగా ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ఇక రుద్రాంశతో అవతరించిన వీరభద్రుడిని దర్శించుకోవడానికి ముందు భక్తులు గణపతిని దర్శించుకోవడం మనకి ఒక క్షేత్రంలో కనిపిస్తుంది. ప్రధానదైవమైన వీరభద్రుడు ... గణపతి తరువాత దర్శనం అందుకునే క్షేత్రమే 'లేపాక్షి'. పురాణ నేపథ్యం గల క్షేత్రాలను ... చారిత్రక వైభవం కలిగిన క్షేత్రాలను ఇష్టపడేవాళ్లను లేపాక్షి కట్టిపడేస్తుంది.
అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరించే ఈ క్షేత్రంలో, ముందుగా గణపతిని దర్శించి ఆ తరువాత ప్రధానదైవమైన వీరభద్రుడిని దర్శిస్తూ ఉంటారు. దక్షుడిని సంహరించడానికి అవతరించినవాడు కనుక వీరభద్రుడు ... ఉగ్రమూర్తిగా చెప్పబడుతున్నాడు. అలాంటి వీరభద్రుడికి గణపతి పట్ల గల వాత్సల్య భావం అంతా ఇంతా కాదు.
గణపతిని దర్శించి ఆ తరువాత తన దగ్గరికి వచ్చిన భక్తుల పట్ల ఆయన మరింత ఆదరణ చూపుతాడట. అలా వచ్చిన భక్తులకు శాంతమూర్తిగా దర్శనమివ్వడమే కాకుండా త్వరగా అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ముందుగా గణపతి దర్శనం చేసుకోవడమనేది ఈ ఆలయ సంప్రదాయంగా కనిపిస్తుంది.