ఇంద్రుడి శాపం ఇక్కడ తొలగిపోయిందట !
సాధారణంగా ఏ క్షేత్రాన్ని దర్శించినా ... తెలిసీతెలియక చేసిన దోషాలు తొలగిపోవాలనే భక్తులు కోరుకుంటూ ఉంటారు. జీవితంలో అభివృద్ధికీ ... ఆనందానికి దోషాల ఫలితాలే అడ్డుపడుతూ ఉంటాయి. అందువలన అవి తొలగిపోయేలా చూడమని భగవంతుడిని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది.
అలా దోషాలు తొలగించే క్షేత్రాలను గురించి తెలుసుకుని వాటిని దర్శించే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'ఆళ్వార్ తిరునగరి' దర్శనమిస్తుంది. తమిళనాడు ప్రాంతంలోని తిరునల్వేలి సమీపంలో గల ఈ క్షేత్రాన్ని 'తిరుక్కూరు గూర్' గా పిలుస్తుంటారు.
ఇక్కడి స్వామివారు 'ఆదినాథ పెరుమాళ్' పేరుతోను ... అమ్మవారు 'ఆదినాథవల్లి' పేరుతోను కొలువై భక్తులకు నయనానందంగా దర్శనమిస్తూ ఉంటారు. తామ్రపర్ణి నదీ తీరంలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో స్వామివారు ... అమ్మవారు ప్రత్యక్షంగా కొలువై ఉంటారని చెప్పబడుతోంది. స్వయంవ్యక్త మూర్తిగా చెప్పబడుతోన్న స్వామివారిని పూజించడం వలన అనతికాలంలోనే అభీష్టాలు నెరవేరతాయని అంటారు.
శాపాలు ... దోషాల కారణంగా బాధలుపడుతున్నవారు స్వామిని సేవిస్తే చాలు, ఆయన అనుగ్రహంతో అవి తొలగిపోతాయని చెబుతారు. అందుకు నిదర్శనంగా దేవేంద్రుడికి సంబంధించిన కథనం ఒకటి స్థలపురాణంగా ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. పితృదేవతలను పూజించని కారణంగా దేవేంద్రుడు వారి ఆగ్రహావేశాలకు గురవుతాడు. వాళ్లచే శపించబడిన ఆయన ... దాని నుంచి బయటపడటానికి ఈ క్షేత్రానికి చేరుకుంటాడు.
ఇక్కడి ఆదినాథ పెరుమాళ్ ను అంకితభావంతో సేవించి ఆయనకి సంతోషాన్ని కలిగిస్తాడు. స్వామి అనుగ్రహంతో శాపం నుంచి విముక్తిని పొంది, తిరిగి అమరలోకానికి చేరుకుంటాడు. ఈ కారణంగానే ఇది మహిమాన్వితమైన క్షేత్రమనీ, ఇక్కడి స్వామిని దర్శించి సేవించినవారి అభీష్టాలు అనతికాలంలోనే నెరవేరతాయని స్పష్టం చేయబడుతోంది.