విష్ణుభగవానుడి లీలావిశేషం వింటే చాలు !
లోక కల్యాణం కోసం త్రిమూర్తులు తమవంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అయితే ఒక్కోసారి పరమశివుడు ... బ్రహ్మదేవుడు బోళాతనంతో అసురులకు వరాలను ప్రసాదించి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులను కూడా లోక కల్యాణానికి అనుకూలంగా మలిచినవాడిగా స్థితికారకుడైన శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు.
లోక కల్యాణం కోసం ఆయన ఆవిష్కరించిన లీలావిశేషాలు ఆసక్తికరంగా ... ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి. అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తూ ఉంటాయి. అలాంటి లీలావిశేషాల్లో ఆయన ధరించిన 'జగన్మోహిని' రూపం ఒకటిగా కనిపిస్తుంది. దేవదానవుల శ్రమ ఫలితంగానే అమృతం లభిస్తుంది. అందువలన దానవులకు కూడా అమృతంలో వాటా దక్కాలి. దుష్టస్వభావాన్ని కలిగిన అసురులు అమృతం సేవిస్తే, ఆ తరువాత జరిగేదంతా హింసే.
అందుకే జగన్మోహిని రూపాన్ని ధరించిన శ్రీమహావిష్ణువు, తన సౌందర్యంతో అసురుల మతిని పోగొట్టి వాళ్లకు అమృతం దక్కకుండా చేస్తాడు. ఇక భస్మాసురుడికి వరాన్ని ప్రసాదించి ఇబ్బందుల్లో పడిన పరమశివుడిని కూడా స్వామి ఇదే రూపంలో ఆదుకుని భస్మాసురుడు అంతమయ్యేలా చేస్తాడు.
మోహినీ రూపంలో తనని చూడాలనే శివుడి ముచ్చట తీర్చిన స్వామి, మహిషి సంహారం అయోనిజుడి చేతిలో రాసి పెట్టి ఉంది కనుక ... మణికంఠుడి జన్మకు కారకుడవుతాడు. ఇలా నేర్పుగా సమస్యలను పరిష్కరిస్తూ లోక కల్యాణాన్ని సాధించడం కోసం శ్రీమహావిష్ణువు చూపిన లీలావిశేషాలు తలచుకున్నాకొద్దీ తరించిపోవడం జరుగుతూ ఉంటుంది.