బాబాను తలచుకుంటే బాధలు దూరమే !
బాబాను తలచుకుంటేచాలు బాధలు దూరమైపోతాయనే విశ్వాసం ఒకప్పుడు శిరిడీ ప్రజలకు ... ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మాత్రమే ఉండేది. అలాంటిది ఈ రోజున బాబాను విశ్వసించే వాళ్లు విశ్వవ్యాప్తంగా కనిపిస్తుంటారు. బాబా చెప్పిన ప్రతి మాట ... బాబా చూపిన ప్రతి మహిమ భక్తులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.
ఎవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, పంజరంలో నుంచి పక్షిని వదిలినట్టుగా ఆ సమస్య నుంచి బాబా బయటపడేస్తాడని అర్థం చేసుకున్నారు. అందువల్లనే ఊరూరా బాబా ఆలయాలు దర్శనమిస్తూ ఉన్నాయి. అలా నిర్మించబడిన బాబా ఆలయాలలో ఒకటి 'గరిడేపల్లి' లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో మండల కేంద్రంగా చెప్పబడుతోన్న ఈ గ్రామంలో చాలాకాలం క్రితమే బాబా ఆలయం నిర్మించబడింది.
ఇక్కడి బాబాను తలచుకుంటే చాలు బాధలు దూరమైపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆయనకి అభిషేకాలు ... అలంకారాలు జరిపిస్తూ మురిసిపోతుంటారు. ప్రతి గురువారం రోజున ... పర్వదినాల్లోను బాబాకు ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. భక్తులంతా పెద్దసంఖ్యలో అంకితభావంతోను ... ఆనందోత్సాహాలతోను పాల్గొంటూ ఉంటారు.
ఇదే ప్రాంగణంలో గల ప్రత్యేక మందిరంలో హనుమంతుడి భారీ విగ్రహం దర్శనమిస్తుంది. దర్శనమాత్రం చేతనే దుష్టశక్తులను దూరం చేసేదిగా ఈ విగ్రహం కనిపిస్తుంది. ఒకవైపున అభయాన్ని ప్రసాదించే హనుమంతుడు ... మరోవైపున దుఃఖాన్ని దూరంచేసే బాబా కొలువైన కారణంగా ఈ ఆలయం భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతూ ఉంటుంది.