భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే చాలు
కష్ట కాలంలో ఎవరు సాయం చేసినా ఆ సాయం పది కాలాలపాటు గుర్తుండిపోతుంది. ఆ సమయంలో సాయం చేసినవారు ఎవరైనా, ఆ సాయాన్ని పొందినవారి దృష్టిలో దేవుడై పోతారు. ఇక దేవుడే మానవ రూపంలో వచ్చి సాయపడితే దానిని మరిచిపోవడం ఎవరివలన కాదు. అలా మరిచిపోతే ఇక ఆ జన్మకు అర్థమేలేదు.
సాయాన్ని అందించిన దేవుడికి సేవ చేసుకోవడమే జీవితానికి అర్థమనీ ... పరమార్ధమని నిరూపించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్లలో 'భాగోజీ' ఒకరు. కుష్ఠువ్యాధితో బాధపడుతోన్న భాగోజీ శిరిడీ చేరుకుంటాడు. ఆయన ఆకలి తీర్చడానికిగానీ, ఆదరించడానికిగాని ఎవరూ ముందుకురారు.
అలాంటి పరిస్థితుల్లో సాయిబాబాయే ఆయనకి నీడ కల్పిస్తాడు ... సేవ చేస్తాడు. ఆయన మానవత్వం గల మహనీయుడు అనుకున్న భాగోజీకి, ఆ కుష్ఠువ్యాధి చేత్తో తీసివేసినట్టుగా తగ్గిపోవడంతో ఆయన దేవుడనే విషయం అర్థమైపోతుంది. వ్యాధి తగ్గిపోయింది కనుక, ఇక వెళ్లవచ్చని చెబుతాడు బాబా. అలా వెళితే తాను మరో మహా పాపం చేసినట్టు అవుతుందని అంటాడు భాగోజీ. బాబా ప్రసాదించిన పునర్జన్మను ఆయన సేవలోనే తరింపజేసుకుంటానని అక్కడే ఉండిపోతాడు.
భాగోజీ అనుక్షణం బాబాను కనిపెట్టుకునుంటూ, ఆయన సేవలో సంతోషాన్ని ... సంతృప్తిని పొందుతాడు. గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడుగా ... గురువునే దైవంగా భావించి సేవించిన భక్తుడిగా భాగోజీ కనిపిస్తాడు. బాబా భక్తులలో ప్రత్యేక స్థానాన్ని పొందిన ఆదర్శవంతమైన వ్యక్తిగా అనిపిస్తాడు.