ఇక్కడి స్థలమహాత్మ్యం అలాంటిది !
మహాదేవుడి మనసు గెలిచిన మహాభక్తుడు మార్కండేయుడు. అల్పాయుష్కుడైన మార్కండేయుడు తన తపస్సుచే పరమశివుడి మెప్పించి, చిరంజీవిగా వరాన్ని పొందాడు. యమపాశం విసిరి ప్రాణాలు తీసుకెళ్లే యమధర్మరాజుని సైతం శివుడు ఎదురించిన సంఘటన మార్కండేయుడి విషయంలోనే జరిగింది.
అంతగా ఆదిదేవుడి అభిమానాన్ని సొంతం చేసుకున్న మార్కండేయుడు, ఆ తరువాత కూడా ఆ స్వామి ఆరాధనను కొనసాగించాడు. అలా ఆయన ఎక్కువకాలం తపస్సు చేసుకున్నట్టుగా చెప్పబడుతోన్న ప్రదేశమే 'అనంతగిరి'. అనంతపద్మనాభ స్వామి ఆవిర్భవించిన కారణంగా ఈ కొండకి ఈ పేరు వచ్చింది.
ప్రాచీనకాలానికి చెందిన అనంతపద్మనాభస్వామి క్షేత్రాలలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలో అనంతగిరి దర్శనమిస్తుంది. ఇక్కడ అనంతపద్మనాభుడు ఆవిర్భవించడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ముచికుంద మహర్షి అభ్యర్థన మేరకు ఇక్కడ స్వామి ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది.
ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశమనీ ... ఈ కారణంగానే స్వామివారు ఇక్కడ ఆవిర్భవించాడని చెప్పబడుతోంది. ఈ కారణంగానే మార్కండేయుడు ఇక్కడి గుహలో తపస్సు చేశాడట. అందుకు గుర్తుగా కాలక్రమంలో ఇదే గుహలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతగిరి క్షేత్రాన్ని దర్శించిన భక్తులు మహాభక్తుడైన మార్కండేయుడిని కూడా దర్శించుకుంటూ ఉంటారు.
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ ప్రదేశాన్ని ఎంచుకుని అనంతపద్మనాభుడుగా ఆవిర్భవించడం ... శివ భక్తుడైన మార్కండేయుడు తపస్సుకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడం ఇక్కడి స్థల మహాత్మ్యాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ ఉంటాయి.