భగవంతుడు అలా సాక్షాత్కరించాడు
ధనార్జనకి మినహా మరి దేనికీ ప్రాధాన్యతను ఇవ్వని పురందరదాసు, ఒకే ఒక్క సంఘటనతో తన మనసును భగవంతుడి సేవవైపు మళ్లిస్తాడు. తన ఆస్తిపాస్తులను పేదలకి పంచి స్వామి ఆరాధనకే తన జీవితాన్ని అంకితం చేస్తాడు. అనునిత్యం ... అనుక్షణం పాండురంగస్వామి నామాన్ని స్మరిస్తూ ... ధ్యానిస్తూ ఉంటాడు.
పాండురంగడి సేవలో ఆయన ... ఆయన సేవలో భార్య నిమగ్నమవుతూ ఉండేవాళ్లు. ఇద్దరూ కలిసి స్వామివారిని అనేక రకాలుగా కీర్తిస్తూ అనేక క్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పురందరదాసు భార్య తనువు చాలిస్తుంది. భగవంతుడి సేవలో తనకి అనుక్షణం తోడుగా ఉంటూ వచ్చిన ఆమె కన్నుమూయడం ఆయన మనసుకి కష్టం కలిగిస్తుంది.
తనకంటే ముందునుంచే ఆమె ఆ పాండురంగడి భక్తురాలు కనుక ఆయన సన్నిధికి చేరుకునే అవకాశం ఆమెకి ముందుగా కలిగిందనుకుని మనసును కుదుట పరచుకుంటాడు. వయసు పైబడినా లెక్క చేయకుండా స్వామి క్షేత్రాలను దర్శిస్తూ ఒంటరిగా బయలుదేరుతాడు. అడవీమార్గంలో అడుగుముందుకు వేయలేని పరిస్థితుల్లో ఆ పాండురంగస్వామి సాయాన్ని కోరతాడు.
ఎంతోకాలంగా తనతో ఆడుతూ వస్తోన్న దాగుడుమూతలు చాలించి ఇక దర్శనం ఇవ్వమని కోరతాడు. అంతే ఆ పాండురంగడు ఆయనకి ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. ఆ స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ పురందరదాసు మురిసిపోతాడు ... తనని తాను మరిచిపోతాడు. ఇంతకన్నా అదృష్టం ... ఆనందం ఇంకేదీ ఉండదంటూ పరవశించిపోతాడు