ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడట !
లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు అనేక ప్రాంతాలలో ఆవిర్భవించాడు. ఆ స్వామిని ఆళ్వారులు అనేక విధాలుగా కీర్తించారు. అలా ఆళ్వారులచే కీర్తించబడిన నూటా ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా 'తిరుక్కాట్కరై' దర్శనమిస్తుంది. కేరళ ప్రాంతంలోని త్రిచూరు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది.
ఇక్కడి స్వామివారు 'కాట్కరాయప్పన్' పేరుతోను ... అమ్మవారు 'పెరుం సెల్వనాయకి' పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. కపిల మహర్షికి స్వామివారు ప్రత్యక్ష దర్శమిచ్చినట్టు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడి పుష్కరిణి కూడా కపిల మహర్షి పేరుతోనే భక్తులను పునీతులను చేస్తుంటుంది.
స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనీ ... అందుకు ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయని ఇక్కడివారు చెబుతుంటారు. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అరటిచెట్లు చాలా ఎక్కువగా ఉండేవట. అయితే ఏదో ఒక విధంగా అరటితోటలు దెబ్బతిని పంట చేతికి రాకుండా పోతుండేది. ఎందుకిలా జరుగుతుందో తెలియక రైతులు అయోమయానికి లోనవుతారు.
ఇక స్వామివారే తమ అరటి పంటలను కాపాడాలంటూ అంతా కలిసి ఆయనకి నమస్కరించుకుంటారు. తమ ఆవేదన ఆయనకి గుర్తుండటం కోసమని బంగారంతో చేయబడిన చిన్న అరటి గెలను స్వామివారికి కానుకగా సమర్పిస్తారు. ఆ రోజు నుంచి అరటి తోటలకు ఎలాంటి నష్టం కలగలేదట.
ఈ కారణంగానే స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనీ, తమ విన్నపాన్ని అర్థం చేసుకుని అనుగ్రహించాడని చెబుతుంటారు. పర్వదినాల్లో ఇక్కడి స్వామివారినీ ... అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రాచీన వైభవాన్ని ఆవిష్కరిస్తోన్న ఈ క్షేత్రాన్ని చూసితీరవలసిందే.