శబరిమలలో అడుగుపెడితే చాలు
ఆధ్యాత్మిక చింతనలో తరించాలనుకునేవారికి అపురూపమైన వరంగా కార్తీకమాసం కనిపిస్తుంది. ఇది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతోంది. హరిహరుల పుత్రుడైన అయ్యప్పస్వామి దీక్షధారణ కూడా ఇదే మాసంలో జరుగుతూ ఉండటం విశేషం.
అయ్యప్పస్వామి ఆలయాలలో మండల దీక్ష ... మాలధారణ చేసిన భక్తులు ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలను కోరుతూ నియమనిష్టలను ఆచరిస్తూ ఉంటారు. దీక్ష విరమణ సమయానికి వాళ్లు స్వామి దర్శనం కోసం 'శబరిమల'కు చేరుకుంటారు. అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడుతోన్న పద్ధెనిమిది మెట్ల ద్వారా వాళ్లు స్వామి సన్నిధానానికి సంబంధించిన ఆవరణలోకి అడుగుపెడతారు.
స్వామి వైభవాన్ని ప్రతిబింబిస్తూ బంగారు తాపడంతో చేయబడిన ధ్వజస్తంభం చూడగానే భక్తులు పులకించిపోతారు. ఇక్కడికి చేరుకోగానే స్వామి దర్శనభాగ్యం కోసం పడే ఆత్రుత మరింత ఎక్కువవుతుంది. 'ధర్మశాస్తా' గా గర్భాలయంలో కొలువైన స్వామివారిని చూడగానే జన్మధన్యమైందనే అనుభూతి కలుగుతుంది. రాజశేఖరపాండ్యుని కృషితో అగస్త్యమహర్షి అధ్వర్యంలో పరశురాముడు ప్రతిష్ఠించిన స్వామివారి మూర్తిని చూడగానే అంతకన్నా అదృష్టం మరేదీ ఉండదని పిస్తుంది.
ఎంతోమంది దేవతలు ... మహర్షులు ... మహారాజులు స్వామిసేవలో తరించిన దివ్యమైన ప్రదేశం ఇది. అలాంటివారి పాద స్పర్శచే పరమ పునీతమైన ఈ క్షేత్రంలో తాను ఉన్నాననే విషయం ప్రతి భక్తుడికి మరిచిపోలేని మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. స్వామివారి సమ్మోహన రూపాన్ని మనసు మందిరంలో నిలుపుకుంటూ అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది.