సాలగ్రామాన్ని పూజిస్తే కలిగే ఫలితం

శిలారూపంలో ... వివిధ ఆకృతులతో ... వర్ణాలతో సాలగ్రామాలు కనిపిస్తూ ఉంటాయి. సాలగ్రామం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమని చెప్పబడుతోంది. అలాంటి సాలగ్రామాలు ఆలయాలలో దైవసన్నిధిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆలయాలలోని ప్రధానదైవంతో పాటు సాలగ్రామాలకు కూడా పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి.

సాలగ్రామాలను ఇంట్లో పూజించకూడదనే అపోహ కారణంగా కొంతమంది వాటికి దూరంగా ఉంటూ వుంటారు. తమకి ఎవరి ద్వారానైనా సాలగ్రామం లభించినా దానిని ఆలయాల్లో ఇచ్చేస్తుంటారు. అయితే నిత్యపూజలు నిర్వహించేవారి పూజా మందిరంలో సాలగ్రామం ఉండవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

మైల .. అంటూ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని నియమనిష్టలను పాటిస్తూ ఉండేవాళ్లు పూజామందిరంలో సాలగ్రామాన్ని ఉంచి నిత్యపూజాభిషేకాలు నిర్వహించవచ్చని చెప్పబడుతోంది. అయితే పూజా సమయంలో తప్ప ఎప్పుడుపడితే అప్పుడు సాలగ్రామాన్ని తాకకూడదనే నియమం కనిపిస్తుంది. సాధారణంగా పూజామందిరం దగ్గర కూర్చుని చేసే పూజలు ... జపతపాలు కొంతవరకూ ఫలితాలను ఇస్తూ ఉంటాయి.

ఇక పూజా మందిరంలో సాలగ్రామం ఉన్నప్పుడు చేసే పూజల ఫలితం విశేషంగా ఉంటుంది. సాలగ్రామాన్ని పూజించడం వలన హరిహరులను ఏక కాలంలో ప్రత్యక్షంగా పూజించిన ఫలితం దక్కుతుంది. సాలగ్రామానికి అనునిత్యం అభిషేకం .. ధూప దీప నైవేద్యాలు సమర్పించడంవలన సమస్తదోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News