ఇక్కడి స్నాన గుండాల విశేషం ఇదే !
తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ప్రాచీనక్షేత్రాలు అలరారుతున్నాయి. పురాణపరమైన నేపథ్యాన్ని ... చారిత్రకపరమైన వైభవాన్ని కలిగివున్న ఈ క్షేత్రాలు, ఇక్కడి ప్రజలకు లభించిన అపురూపమైన వరాలుగా చెప్పుకోవచ్చు. శివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు ... వైష్ణవ సంబంధమైన స్వయంభువు క్షేత్రాలు ఎన్నో ఇక్కడ విలసిల్లుతున్నాయి.
ఒకే ప్రదేశంలో శివకేశవులు కొలువుదీరిన క్షేత్రాలు కూడా ఎక్కువగానే విలసిల్లుతున్నాయి. దేవతలు ... మహర్షులు ... సిద్ధులు మొదలైనవారి పాదస్పర్శతో పరమపవిత్రమైన ఈ క్షేత్రాలు వివిధ విశేషాలను సంతరించుకుని మహిమాన్వితమైనవిగా వెలుగొందుతున్నాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'మెట్టుగుట్ట' దర్శనమిస్తుంది.
ఇది వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో కనిపిస్తోంది. పుణ్యరాశిగా కనిపించే ఈ గుట్టపై పరమశివుడు ... శ్రీరాముడు దర్శనమిస్తూ ఉంటారు. రాముడికీ శివుడంటే అంతులేని అభిమానం ... శివుడికి రాముడంటే అంతకుమించిన అనురాగం. ఇందుకు నిదర్శనంగానే ఇక్కడ శివుడు ... రాముడు ఎదురెదురుగా ప్రత్యేక ఆలయాల్లో కొలువుదీరి ఉంటారు.
పూర్వం ఈ గుట్టపై నవనాథులు తపస్సు చేసుకున్నట్టు చెబుతారు. వాళ్ల తపోశక్తి కారణంగానే ఇక్కడ తొమ్మిది గుండాలు ఏర్పడ్డాయని అంటారు. ఈ తొమ్మిది గుండాలు ఒక్కో పేరునీ ... ఒక్కో విశేషాన్ని సంతరించుకున్నవిగా చెప్పబడుతున్నాయి. ఒక్కో గుండంలో స్నానం చేయడం వలన ఒక్కో ఫలితం లభిస్తుందని అంటారు.
అలా ఈ తొమ్మిది గుండాలలో స్నానం చేయడం వలన జన్మజన్మల పాపాలు ... అనేక దోషాలు నశించిపోతాయని విశ్వసిస్తారు. ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు. ఇక్కడి శివుడిని రాముడు పూజించిన కారణంగా ... ఆ తరువాత ఆయన కూడా ఇక్కడ కొలువైన కారణంగా ... నవ గుండాల విశేషం వలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు.