భక్తులు ఎక్కడుంటారో బాబా అక్కడుంటాడు
శిరిడీ సాయిబాబా అంటే నానాసాహెబ్ చందోర్కర్ కి ఎంతో ఇష్టం. ఆయనని చందోర్కర్ ఎంతగానో విశ్వసించేవాడు ... ఆరాధించేవాడు. బాబాను చూడకుండా ఉండలేకపోయేవాడు. తన భక్తులు ఎక్కడ ఉన్నా బాబా చూస్తూనే ఉంటాడు గనుక ఆయనకి బెంగలేదు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ ఉద్యోగరీత్యా పండరీపురానికి వెళ్లవలసి వస్తుంది.
బాబాని వదిలివెళ్లడం ఆయనకి ఇష్టం లేకపోయినా అది పైఅధికారుల ఆదేశం కనుక ఆయన అక్కడికి బయలుదేరాలని నిర్ణయించుకుంటాడు. అక్కడికి వెళ్లడానికి ముందు బాబాను కలుసుకుని ఆయన ఆశీస్సులు కోరాలని అనుకుంటాడు. వీలైతే బాబాను కూడా తనతో వచ్చేయమని అడుగుదామని మశీదుకు చేరుకుంటాడు.
అక్కడి సహచరులతో బాబా మాట్లాడుతూ తాను పండరీపురంలో కూడా ఉన్నాననీ, తనని వదిలి వెళుతున్నామనుకుని ఎవరూ బాధపడవలసిన పనిలేదని బాబా అంటాడు. తన భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ తాను ఉంటానంటూ నానాసాహెబ్ చందోర్కర్ వైపు చూస్తూ నవ్వుతాడు. తనకి పండరీపురం బదిలీ అయిందనే విషయం బాబాకి తెలిసిపోయిందని ఆయనకి అర్థమైపోతుంది. తాను అడగాలనుకున్న ప్రశ్నకి సమాధానంగానే బాబా అలా మాట్లాడాడని గ్రహిస్తాడు.
సర్వం తెలిసిన సాయికి తాను చెప్పవలసిన పనిలేదని భావించిన ఆయన, భక్తి శ్రద్ధలతో బాబా పాదాలకు నమస్కరించి ఆయన నుంచి సెలవు తీసుకుంటాడు. బాబా ఎప్పటికీ తనకి అండదండగానే ఉంటాడనే పూర్తివిశ్వాసంతో అక్కడి నుంచి బయలుదేరుతాడు.