వివాహ వేడుక జరుగుతున్నట్టు కలవస్తే !

సాధారణంగా ఎవరైనా ఒక విషయాన్ని గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఉంటే, అదే విషయం దృశ్యరూపాన్ని సంతరించుకుని కలగా రావడం జరుగుతూ ఉంటుంది. అలా వచ్చే కలల్లో ఆనందాన్ని కలిగించేవి కొన్నయితే, ఆందోళన కలిగించేవి మరికొన్ని ఉంటాయి.

తనకిగానీ తనవారికి గాని ప్రమాదం జరిగినట్టు ... ఆపదలో పడినట్టు కలవస్తే, ఆ కంగారు నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. తిరిగి నిద్రపట్టకపోవడం వలన ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ కూర్చోవడం జరుగుతుంది. ఇక తనకి సంతోషాన్ని కలిగించే ఏ దృశ్యమైనా కలలో కనిపిస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇలాంటి కల వచ్చినప్పుడు అప్పుడే తెల్లవారిందా అనిపిస్తుంది.

ఇలా వచ్చిన కలల్లో కొన్నిమాత్రమే ... అదికూడా అవి వచ్చిన సమయాన్నిబట్టి మాత్రమే ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. ఎక్కడో ఏదో వివాహవేడుక జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్లినట్టు ... అంతా తనని పలకరిస్తున్నట్టు ఒక్కోసారి కల వస్తూ ఉంటుంది. బయటచూడని ఎంతోమంది వ్యక్తులు ఆ వేడుకలో కనిపిస్తుంటారు. అక్కడి అలంకరణ ... పిల్లల సందడి ... పెద్దల పలకరింపు ఇవన్నీ కూడా మెలకువ వచ్చేంత వరకూ నిజంగా జరుగుతున్న అనుభూతిని కలిగిస్తుంది.

మెలకువ వచ్చాక .. అది ఎవరి వివాహ వేడుకో ... అక్కడికి తాము ఎందుకు వెళ్ళామో ... ఎవరిని చూశామో గుర్తుకు రాదు. ఎందుకని ఇలాంటి కల వచ్చిందా అనే ఆలోచన మాత్రం కలుగుతుంటుంది. అయితే వివాహ వేడుక జరుగుతున్నట్టుగా కల రావడం శుభప్రదమైనదేనని చెప్పబడుతోంది. కలలో వివాహ వేడుకను చూడటం వలన అనతికాలంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వినడం ... శుభకార్యాలు జరపడం లేదా పాల్గొనడం జరుగుతుంది. అంతే కాకుండా ఏదో ఒక రూపంలో ధనయోగం కలుగుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News