శివలింగంపై మహర్షి చేతి గుర్తులు !
దేవతల సంకల్పం కారణంగా ... మహర్షుల తపోఫలితంగా ... మహాభక్తుల అభ్యర్థన వలన పరమశివుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. లింగాకృతిలో ఆవిర్భవించిన స్వామి భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ అనుగ్రహిస్తున్నాడు. సదాశివుడు శిలగా లింగాకృతిలో దర్శనమిస్తోన్న ప్రతి క్షేత్రం ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.
శివలింగంపై ఏర్పడిన కొన్ని గుర్తులు స్వామి మహిమకు నిదర్శనంగా అనిపిస్తుంటాయి. అలా ఏర్పడిన కొన్ని గుర్తుల వెనుక పురాణ సంబంధమైన కథనాలు ఆసక్తికరంగా వినిపిస్తూ ఉంటాయి. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా 'పట్టిసీమ' దర్శనమిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా పట్టిసం కనిపిస్తుంది. లింగాకృతిలో ఆవిర్భవించిన వీరభద్రుడు ... వీరేశ్వరుడుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాడు.
ఇక్కడి శివలింగంపై కనిపించే గుర్తులు ... చేతి గుర్తులుగా చెబుతుంటారు. ఆ గుర్తులు ఏర్పడటానికి గల కారణంగా పురాణ సంబంధమైన కథ వినిపిస్తుంది. పరమశివుడి అంశావతారమైన వీరభద్రుడు ఆయన ఆదేశం మేరకు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. దక్షుడి తలను ఖండించిన పట్టిసం అనే ఆయుధంతో ఆయన దేవకూట పర్వతంపై ఆనందోత్సాహంతో నాట్యం చేస్తాడు.
భద్రకాళీ సమేతంగా అక్కడ ఆవిర్భవించమని అగస్త్య మహర్షి కోరడంతో, అందుకు ఆయన అంగీకరిస్తాడు. ఆ సంతోషంతో అగస్త్య మహర్షి వీరభద్రుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆ సందర్భంలో వీరభద్రుడిపై ఆయన చేతి గుర్తులు పడ్డాయనీ, ఆయన లింగరూపాన్ని ధరించడంతో దానిపై అగస్త్య మహర్షి చేతి గుర్తులు అలాగే ఉండిపోయాయని స్థలపురాణం చెబుతోంది.
ఆ చేతి గుర్తులు మహర్షి అనురాగానికి ... వీరేశ్వరస్వామి అనుగ్రహానికి నిదర్శనంగా దర్శనమిస్తూ ఉంటాయి. శివలింగంపై గల ఆ గుర్తులను చూసినప్పుడు మనోహరమైన ఆ దృశ్యం కనులముందు కదలాడుతూ ఉంటుంది. అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తూ ఉంటుంది.