కార్యసిద్ధిని కలిగించే హనుమంతుడు
హనుమంతుడు ... శివాంశ సంభూతుడు ... శ్రీరాముడి భక్తుడు ... సూర్యభగవానుడి శిష్యుడు. అందువలన హనుమంతుడిని పూజించినవారికి వాళ్లందరి అనుగ్రహం ఉంటుంది. హనుమంతుడిని సేవించడం వలన సమస్త దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది.
అనారోగ్యాల బారిన పడినవాళ్లు ... పీడ కలలతో బాధలుపడుతోన్నవాళ్లు ... గ్రహ సంబంధమైన దోషాలతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు ఆ స్వామిని అర్చిస్తూ ఉంటారు. అలా భక్తులచే పూజలు అందుకుంటోన్న హనుమంతుడి ఆలయాలలో ఒకటి 'వల్లాపురం'లో దర్శనమిస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది.
ముదిగొండ మండలంలో చెప్పుకోదగిన ప్రాచీనక్షేత్రాలు విలసిల్లుతున్నాయి. అమ్మపేటలో వేంకటేశ్వరస్వామి ... వనంవారి కృష్ణాపురంలో సీతారాములు ... పమ్మిలో చెన్నకేశవస్వామి స్వయంభువు క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. ఈ క్షేత్రాలకు అత్యంత సమీపంలో గల వల్లాపురంలో భక్తాంజనేయుడు దర్శనమిస్తూ ఉంటాడు. చాలాకాలం నుంచి స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నట్టుగా స్థానికులు చెబుతుంటారు.
స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనీ, ఆయనకి చెప్పుకుని ఏ కార్యాన్ని ఆరంభించినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని అంటారు. తమ కుటుంబాలను ... పాడిపంటలను కాపాడుతున్నది స్వామివారేనన్న విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ప్రతి మంగళవారం స్వామివారికి సిందూరాభిషేకం ... ఆకుపూజలు జరిపిస్తుంటారు. వడలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. స్వామి దర్శన మాత్రం చేతనే సమస్యలు తొలగిపోయి సకలశుభాలు చేకూరతాయని చెబుతుంటారు.