ఎవరినెలా కలపాలో దైవానికి తెలుసు
భగవంతుడు తన భక్తులను కనిపెట్టుకునుంటూ వాళ్లకి మంచి జరిగేలా చేస్తుంటాడు. సమస్యల వలయంలో వాళ్లు చిక్కుకోకుండా ... కష్టాల ఊబిలో పడిపోకుండా వాళ్ల జీవితాలకు మార్గనిర్దేశం చేస్తుంటాడు. కొంతమంది భక్తుల జీవితాలను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమవుతూ ఉంటుంది. ముఖ్యంగా శివభక్తులైన పార్వతీ శివదాసులను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న పార్వతి, సవతితల్లి పెట్టే కష్టాలను భరిస్తూనే పెరుగుతుంది. ఆ సదాశివుడిని సేవిస్తూ తన బాధలను మరిచిపోతుంటుంది. ఇక అదే గ్రామానికి చెందిన శివదాసు కూడా అనుక్షణం ఆ పరమశివుడిని అర్చించేవాడే. కాయకష్టం చేసుకుంటే తప్ప పూటగడవని పరిస్థితిల్లో అతను ఉంటాడు. అందువలన అతనికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు.
అలాంటి పరిస్థితుల్లో పార్వతిని ఒక అమాయకుడికి కట్టబెట్టి ఆమెని వదిలించుకోవడానికి సవతి తల్లి ప్రయత్నిస్తుంది. అయితే సదాశివుడి సంకల్పం వేరేగా ఉండటం వలన అనుకోని విధంగా ఆ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోతుంది. పెళ్లి మంటపంలో ఉండవలసిన మంగళసూత్రం ఆ వేడుక చూడటానికి వచ్చిన శివదాసు చేతిలోకి వస్తుంది. అందరూ అది సాక్షాత్తు శివుడి సంకల్పంగా చెప్పుకుంటారు. ఆమెకి తగిన వరుడిని ఆ పరమేశ్వరుడే ఎంపిక చేశాడని అనుకుంటారు.
శివదాసు మంచితనం గురించి తెలిసిన కారణంగా ... పార్వతి శివభక్తి గురించి తెలిసిన కారణంగా ఆమె తండ్రి కూడా ఇది ఈశ్వరుడి ఆదేశంగానే భావిస్తాడు. అలా శివభక్తులైన వాళ్లిద్దరినీ ఆ సదాశివుడు ఒక గూటికిందకి తెస్తాడు. ఆదిదేవుడి ఆరాధనలోనే తరిస్తూ ఆ దంపతులు తమ జీవితాన్ని చరితార్థం చేసుకుంటారు.