ఈ రోజున ఇవి దానం చేస్తే చాలు !

కోరిన వరాలను సులభంగా పొందగలిగేలా చేయడమే కార్తీకమాసం ప్రత్యేకత. ఈ మాసంలో శ్రీమహావిష్ణువుని ... పరమశివుడిని ... అమ్మవారిని ఆరాధించడం వలన కలిగే ఫలితం అంతా ఇంతాకాదు. ఇక ప్రత్యేక పూజలు ... నోములు ... వ్రతాలతో ఈ మాసమంతా సందడిగా కనిపిస్తూ ఉంటుంది.

ఈ మాసంలో చేయబడిన ఒక్కోవ్రతం ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... సంతాన సౌభాగ్యాలను గురించి ఈ వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మోక్షానికి అవసరమైన అర్హతను కూడా ప్రసాదించే వ్రతంగా 'ఏకాదశి' వ్రతం కనిపిస్తుంది. కార్తీక బహుళ ఏకాదశి 'రమా ఏకాదశి' గా చెప్పబడుతోంది.

శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది ... ఏకాదశిదేవి జన్మించినది ఈ రోజేనని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టతను కలిగిన ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... పూజామందిరాన్ని అలంకరించాలి. ఉపవాస దీక్షను చేపట్టి జాగరణకు సిద్ధపడి అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును ఆరాధించాలి.

శ్రీమన్నారాయణుడిని పూజించిన అనంతరం సాలగ్రామం ... పెసరపిండితో చేసిన లడ్డూలు ... బెల్లం దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. ఈ విధంగా రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అనేకమైన దోషాలు నివారించబడతాయి ... అనంతమైన పుణ్యఫలితాలు కలుగుతాయి. అందుకు నిదర్శనంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన అనేకమంది కథలు ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తూ ఉంటాయి.


More Bhakti News