దేవుడి మెడలోని హారం అలా మాయమైంది !
ఆదికేశవస్వామిని అనునిత్యం పూజిస్తూ ... అనుక్షణం ధ్యానిస్తూ ... కీర్తిస్తూ కనకదాసు పరవశించిపోయేవాడు. పండితులమని చెప్పుకునే కొంతమంది అసమానమైన ఆయన భక్తిశ్రద్ధలను చూసి అసూయపడేవారు ... మరికొందరు ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఆ స్వామి లీలాశేషాలను గురించి పాడుతూ ఆయన అనేక క్షేత్రాలను దర్శిస్తూ 'ఉడిపి' క్షేత్రానికి చేరుకుంటాడు.
కొంతమంది అసూయాపరులు ఆయన ఆలయంలోకి రావడానికి వీల్లేదంటూ అడ్డుకుంటారు. ఒకవైపున స్వామిని చూడలేదనే బాధ ... మరోవైపున విపరీతమైన ఆకలి ఆయనని నిలవలేకుండా చేస్తుంటాయి. ఆవేదనతో తన పరిస్థితిని ఆ స్వామికి విన్నవించుకుంటాడు. ముందుగా కనకదాసు ఆకలి తీర్చి ఆ తరువాత ఆయన ఎంతటి భక్తిపరుడో నిరూపించాలని కృష్ణుడు నిర్ణయించుకుంటాడు.
అంతే వెంటనే ఆ స్వామి బాలకుడి రూపంలో వచ్చి ఆయనకి తన మెడలోని హారాన్ని అందజేస్తూ దానిని సత్రంలో ఇచ్చి భోజనం చేయమని చెబుతాడు. అది కృష్ణుడి లీలావిశేషంగా భావించిన కనకదాసు ఆయన చెప్పినట్టుగానే చేస్తాడు. అదే సమయంలో స్వామివారి మూలమూర్తి మెడలోని విలువైన హారం మాయం కావడాన్ని సిబ్బంది గమనించడంతో వెతుకులాట మొదలవుతుంది.
అంతా కలిసి కనకదాసును దొంగగా తేల్చి ఆయనని శిక్షించడానికి సిద్ధపడతారు. అంతే గర్భాలయంలోని మూలమూర్తి కనకదాసు వైపుకి తిరిగిపోతుంది. ఆ సంఘటన ప్రత్యక్షంగా చూసిన చాలామంది తమ కళ్లను తామే నమ్మలేకపోతారు. ఆ తరువాత ఈ లోకంలోకి వచ్చి కనకదాసు గొప్పతనాన్ని గుర్తించి ఆయన పాదాలకి నమస్కరిస్తారు.