శని ప్రతికూల ప్రభావం ఇలా తగ్గుతుందట !
జాతకంలో శని ప్రభావం ప్రతికూలంగా ఉండటం వలన కలిగే కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సమయంలో సమస్యలు ఒకదాని తరువాత ఒకటిగా ఎదురవుతూ ఉంటాయి. ఒక సమస్యను ఎదుర్కునే అవకాశం ఇవ్వకుండానే మరో సమస్య వచ్చిపడుతూ ఉంటుంది. దాంతో ఏం చేయాలో తెలియని అయోమయస్థితి ఏర్పడుతుంది.
పరిష్కారం దిశగా ఆలోచించనీయకుండా చేసే సమస్యలు జీవితం పట్ల నిరాశా నిస్పృహలను కలిగిస్తుంటాయి. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి మానసికంగా కుంగిపోయేలా చేస్తుంటాయి. శని చూపించే ప్రతికూల ప్రభావం నుంచి బయటపడాలంటే ఆయన అనుగ్రహాన్ని సంపాదించడం తప్ప మరోమార్గం లేదు.
అందుకే శనిని శాంతింపజేయడానికి ఎవరికి తోచిన పద్ధతిని వాళ్లు ఆచరిస్తుంటారు. శనిదేవుడు కొలువుదీరిన క్షేత్రాలను దర్శించి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. శాంతులు ... హోమాలు జరిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో శని అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని తేలికైన మార్గాలు కూడా చెప్పబడుతున్నాయి. ఇతర జీవరాశుల పట్ల సానుభూతుని కలిగి ఉండటాన్ని శని ఇష్టపడతాడట. ఇతర జీవురాశులపట్ల సానుభూతితో వాటికి అవసరమైన ఆహారాన్ని ఏర్పాటుచేసినవారిపై తన ప్రభావం ప్రతికూలంగా లేకుండా చేస్తాడు.
అందుకే శని ప్రతికూల ప్రభావం నుంచి బయటపడాలనుకునే వాళ్లు శనివారం రోజున బెల్లంతో కలిపిన నువ్వులను చీమలకు ఆహారంగా వెయ్యాలి. ఈ విధంగా చేస్తూ వెళ్లడం వలన శని కరుణిస్తాడు ... ఆనందంతో అనుగ్రహిస్తాడు. ఇతర జీవరాశుల పట్ల సానుభూతిని కలిగివుండటం ద్వారా తన మనసు గెలుచుకున్నవారిపై ఆయన ప్రతికూల ప్రభావం తగ్గుతుందని చెప్పబడుతోంది.