ఈ రోజున ఈశ్వరుడికి పాలాభిషేకం చేయాలి

కార్తీకమాసంలో చేయబడిన ప్రతి పూజా ఆశించిన ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఈ మాసంలో పూజలు ... నోములు ... వ్రతాలను ఆసక్తిగా జరుపుతుంటారు. ముఖ్యంగా నోములు ... వ్రతాలు ఆచరించడంలో స్త్రీలు తీరికలేకుండా ఉంటారు. వివాహయోగం ... సంతాన భాగ్యం ... సౌభాగ్య రక్షణకి సంబంధించిన వ్రతాలను ఈ మాసంలో ఆచరిస్తూ ఉంటారు.

అలా సంతానాన్ని కోరుకునే దంపతులు ఆచరించే వ్రతంగా 'దాంపత్యాష్టమి వ్రతం' ఒకటిగా చెప్పబడుతోంది. వివాహమైన తరువాత ఆ జంటకు కలగనున్న సంతానం కోసం ఇరుకుటుంబాల వాళ్లు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ విషయంలో ఏ మాత్రం కాస్త ఆలస్యమైనా వాళ్లు ఆందోళన చెందుతుంటారు. అలాంటివాళ్లకి ఆశించిన వరాన్ని అందించేదిగా 'దాంపత్యాష్టమి వ్రతం' కనిపిస్తుంది.

కార్తీక బహుళ అష్టమి ... దాంపత్యాష్టమిగా చెప్పాబడుతోంది. ఈ రోజునే దాంపత్యాష్టమి వ్రతాన్ని ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దంపతులు ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ... పూజా మందిరంలో శివపార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజామందిరాన్ని పూలమాలికలతో అలంకరించాలి. శివలింగానికి పాలతో అభిషేకం చేసి ... వివిధ రకాల పుష్పాలతో అర్చించాలి.

ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోతే శివాలయానికి వెళ్లి పాలతో అభిషేకం చేయించి ప్రత్యేక పూజలు జరిపించాలి. అత్యంత భక్తిశ్రద్ధలతో శివపార్వతులను ఆరాధించి వాళ్లకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. నియమనిష్టలతో ... భక్తిశ్రద్ధలతో ఈ రోజున ఈ వ్రత విధానం ద్వారా శివపార్వతులను పూజించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News