ద్వాదశ జ్యోతిర్లింగ నామస్మరణ ఫలితం
సదాశివుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక పవిత్రమైన ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా ఆయన జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా ... మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ జ్యోతిర్లింగాలను దర్శించడం వలన సాక్షాత్తు మహాదేవుడిని ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. అంతటి విశిష్టతను కలిగిన జ్యోతిర్లింగాలు పన్నెండు ప్రదేశాల్లో విలసిల్లుతున్నాయి.
గుజరాత్ లో 'సోమనాథ జ్యోతిర్లింగం' .. ఆంధ్రప్రదేశ్ లో 'మల్లికార్జున జ్యోతిర్లింగం' .. మధ్యప్రదేశ్ లో 'మహాకాళ జ్యోతిర్లింగం' ... 'ఓంకారేశ్వర జ్యోతిర్లింగం' ... హిమాచలప్రదేశ్ లో 'కేదారనాథ జ్యోతిర్లింగం' ... మహారాష్ట్రలో 'భీమశంకర జ్యోతిర్లింగం' ... 'త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం' ... 'వైద్యనాథ జ్యోతిర్లింగం' ... 'నాగేశ్వర జ్యోతిర్లింగం' ... 'ఘ్రుష్మేశ్వర జ్యోతిర్లింగం' ఉత్తరప్రదేశ్ లో 'విశ్వేశ్వర జ్యోతిర్లింగం' ... తమిళనాడులో 'రామేశ్వర జ్యోతిర్లింగం'దర్శనమిస్తాయి. వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలుస్తుంటారు ... కోటి నమస్కారాలను సమర్పిస్తూ కొలుస్తుంటారు.
జ్యోతిర్లింగాలను ఎప్పుడు దర్శించినా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. అలాంటిది అత్యంత పవిత్రమైన కార్తీకమాసంలో ఏ ఒక్క జ్యోతిర్లింగాన్ని దర్శించినా ఆ పుణ్యఫలితం అనంతమని చెప్పబడుతోంది. జ్యోతిర్లింగాలను దర్శించే అవకాశం లేనివాళ్లు కార్తీకమాసంలో వాటి నామాలను స్మరించినాచాలని అంటారు. కార్తీకమాసంలో జ్యోతిర్లింగాల నామాలను చెప్పుకుంటేచాలు అనేక జన్మలనాటి పాపాలు నశించి, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.