ఎరుమేలిలో కనిపించే విశేషం ఇదే !
కార్తీకమాసం ... పరమపవిత్రమైన మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసంలో దీక్ష ధారణలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయ్యప్పస్వామి దీక్షను చేపట్టే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కనుక, ఈ మాసంలో ఆలయాలు భక్తుల సందడితో కిటకిటలాడుతూ ఉంటాయి.
మాలధారణ చేసిన దగ్గర నుంచి భక్తులు అనేక నియమనిష్టలను పాటిస్తూ స్వామి పట్ల తమకి గల భక్తి విశ్వాసాలను చాటుతూ ఉంటారు. దీక్ష విరమణకు ముందుగా శబరిమల యాత్ర చేస్తుంటారు. అత్యంత కష్టతరమైన అడవీ మార్గంలో ప్రయాణం చేస్తూ ... స్వామి భజనలతో తమని తాము మరిచిపోతారు. అలసటకు దూరమై ఆనందానుభూతులను పొందుతుంటారు.
స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి వాళ్లు సాగించే ప్రయాణంలో 'ఎరుమేలి' ఒక ముఖ్యమైన మజిలీగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడికి చేరుకున్న భక్తులు స్వామివారి భజనచేస్తూ ఆనందోత్సాహాలతో 'పేటై తులాలు' ఆడుతుంటారు. భక్తులు తమని తాము మరిచిపోతూ ఇక్కడ ఇలా నాట్యం చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.
ఇంద్రాది దేవతలపై అసురసేనతో విరుచుకుపడిన మహిషిని ఎవరూ నియంత్రించలేక పోతుంటారు. దేవతల అభ్యర్థన మేరకు మహిషిని సంహరించడం కోసం స్వామి రంగంలోకి దిగుతాడు. మహిషిని అణచే ప్రయత్నంలో భాగంగా స్వామి ఆమె శరీరంపై నాట్యం చేశాడట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ... మహిషి శిరస్సుభాగం పడిన ఈ ప్రదేశంలో భక్తులు 'పేటై తులాలు' ఆడుతూఉంటారు.
ఆనాటి స్వామివారి విజయోత్సవాన్ని తలచుకుంటూ ... ఆనందంతో పొంగిపోతూ ముందుకు సాగిపోతుంటారు. భక్తుల అలసటను దూరంచేసి వాళ్లకి ఆనందోత్సాహాలను అందించే ఎరుమేలి ప్రయాణం వాళ్ల మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.