దుష్టశక్తులను తరిమేసే లక్ష్మీనరసింహుడు
భక్తుడిని రక్షించడం కోసం ... భక్తుడి మాట నిజం చేయడం కోసం నరసింహస్వామి అవతరించాడు. హిరణ్యకశిపుడిని సంహరించడం వలన ... ప్రహ్లాదుడిని అనుగ్రహించడం వలన ఆయన తన అవతార కార్యాన్ని గురించి ఈ లోకానికి చెప్పకనే చెప్పాడు. అలా భక్తుడి కోరిక మేరకు లక్ష్మీసమేతంగా ఆ స్వామి అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు.
అలా స్వామివారు కొలువుదీరిన ప్రదేశాలు మహిమాన్వితమైన క్షేత్రాలుగా అలరారుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటి 'పెద్ద దేవులపల్లి' లో విలసిల్లుతోంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పరిధిలో ఈ ఆలయం దర్శనమిస్తోంది. నల్గొండ జిల్లాలో గల ప్రాచీన లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లో ఇది ఒకటిగా కనిపిస్తుంది. ఆలయంలో గల శాసనాలు ఈ క్షేత్ర సంబంధమైన విషయాలను ... గత వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి.
గ్రామస్తులు ఇక్కడి లక్ష్మీనరసింహుడిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు. ఆయన కారణంగానే తామంతా చల్లగా ఉన్నామని విశ్వసిస్తూ అంకితభావంతో ఆరాధిస్తూ ఉంటారు. సహజంగానే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలు మహాశక్తిమంతమైనవిగా అనిపిస్తుంటాయి. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తులకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంటుంది.
దుష్టశక్తుల బారి నుంచి కాపాడటంలోను, ఆరోగ్యాన్నీ ... ఐశ్వర్యాన్ని ప్రసాదించడంలోను ఇక్కడి స్వామి ప్రత్యేకతను కలిగి ఉన్నాడని చెబుతుంటారు. స్వామివారి దర్శనమాత్రం చేత మానసిక పరమైన ... శారీరక పరమైన రుగ్మతల నుంచి బయటపడినవాళ్లు ఎంతోమంది ఉన్నారని చెబుతుంటారు. పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ... కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు.