ఈ రోజున వీటిని నైవేద్యంగా సమర్పించాలి
సత్యధర్మాలను ఆచరించడంలో శ్రీరాముడు లోకానికి ఆదర్శంగా నిలిచాడు. పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తూ మహిళాలోకానికి సీత ఆదర్శమూర్తిగా నిలిచింది. లోక కల్యాణం కోసం సీతారాములు అనేక కష్టాలను అనుభవించారు. వాళ్లు చేసిన త్యాగానికి గుర్తుగా ప్రతి గ్రామంలోను ... ప్రతి హృదయంలోను కొలువై కనిపిస్తారు.
సీతారాములను పూజించడం వలన సకలశుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడి జన్మనక్షత్రమైన 'పునర్వసు' నక్షత్రం రోజున సీతా సమేతుడైన రాముడిని ఆరాధించడం వలన కలిగే ఫలితం విశేషంగా ఉంటుందని చెప్పబడుతోంది.
సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం రోజున ఆలయాలలో సీతారాములకి ప్రత్యేకంగా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం రోజున సీతారాములను పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి సీతారాములను షోడశ ఉపచారాలతో పూజించి పానకం - వడపప్పు నైవేద్యంగా సమర్పించాలని చెప్పబడుతోంది. అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ రోజున చేసే పూజ వలన కష్టాలు దూరమై ... సుఖశాంతులతో కూడిన జీవితం చేరువవుతుందని స్పష్టం చేయబడుతోంది.