ఇక్కడి స్వామివారి మహిమకు ఇదే నిదర్శనం !

శ్రీమన్నారాయుణుడే లోక కల్యాణం కోసం నృసింహస్వామిగా అవతరించాడు. ఈ కారణంగానే లక్ష్మీనృసింహస్వామివారు ఎక్కడ ఆవిర్భవించినా వారి శిరోభాగాన ఆదిశేషుడు పడగవిప్పి కనిపిస్తూ ఉంటాడు. ఆదిశేషుడి పడగ అందమైన ఛత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయనే స్వామివారి క్షేత్రాలను సదా కాపాడుతూ ఉంటాడని అంటారు. అందుకు ఉదాహరణగా కనిపించే క్షేత్రాల్లో 'అర్వపల్లి' ఒకటిగా దర్శనమిస్తుంది.

నల్గొండ జిల్లాలో గల ప్రాచీన నృసింహస్వామి క్షేత్రాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. పవిత్రమైన ఈ ప్రదేశంలో స్వామివారు ఇచ్ఛాపూర్వకంగా అడుగుపెట్టాడని చెబుతారు. గర్భాలయంలో గల యోగానంద లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలోనే ఒక పుట్ట ఉంటుంది. ఈ పుట్ట పైకి కనిపించే భాగం తక్కువే అయినా అది విశాలంగా లోపలి భాగాన్ని ఎక్కువగా కలిగి ఉంటుందని చెబుతారు.

ఇందులోని సర్పమే ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటుందని అంటారు. స్వామివారి సేవలకి సంబంధించిన నియమనిష్టల్లో ఏ మాత్రం లోపం జరిగినా, మైల .. అంటూ వంటి వాటిని లెక్కచేయకుండా ఎవరైనా ఆలయంలోకి అడుగుపెట్టినా ఈ పుట్టలో నుంచి బుసలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయట. వెంటనే విషయాన్ని అర్థంచేసుకుని అక్కడి పవిత్రతకు తగిన విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. పుట్టలో నుంచి పాము బుసలు రావడం తగ్గడమే స్వామి శాంతించాడనడానికి నిదర్శనమని చెబుతారు.

ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని అందరూ విశ్వసిస్తుంటారు. ఎంతోమంది భక్తులు స్వామివారి పాదాలను ఆశ్రయించి, ఆయురారోగ్యాలను ... సంతాన సౌభాగ్యాలను పొందుతుంటారు. దుష్టప్రయోగాల బారినుంచి బయటపడుతూ ఉంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడమే అదృష్టంగా భావిస్తుంటారు.


More Bhakti News