అందుకే భక్తులను ఆపదలు దరిచేరవు
ఎవరికి ఎలాంటి హాని చేయకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తోన్నవాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా భగవంతుడు చూస్తుంటాడు. ఇక ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, అనునిత్యం ఆయనని సేవిస్తూ .. కీర్తిస్తూ ఉండేవాళ్లను ఆయన అనుక్షణం కాపాడుతూనే ఉంటాడు. ఏ వైపునుంచి ఎలాంటి ఆపదలు తన భక్తుల దరిచేరకుండా రక్షిస్తూ ఉంటాడు.
ఇందుకు ఉదాహరణగా ఎంతోమంది మహాభక్తుల జీవితంలో జరిగిన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి భక్తులలో 'వాగీశ నాయనార్' ఒకరుగా కనిపిస్తాడు. వాగీశ నాయనార్ శివభక్తులలో ముందువరుసలో కనిపిస్తాడు. కొంతమంది స్వార్థపరులు ఆయనని ఇబ్బందులకు గురిచేయాలని నిర్ణయించుకుంటారు.
ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్లు రాజును కూడా తమ వైపుకి తిప్పుకుని, ఆయన ద్వారా వాగీశ నాయనార్ ని మరిన్ని కష్టాలకు గురిచేయడం మొదలుపెడతారు. ఇలా ఎన్నివిధాలుగా బాధలుపెడుతున్నా వాటిని గురించి పెద్దగా పట్టించుకోకుండా వాగీశ నాయనార్ శివారాధనలో మునిగి తేలుతుంటాడు. ఆయన ధోరణి రాజుగారికి మరింత ఆగ్రహావేశాలను కలిగించడంతో, శిక్షలను కఠినతరం చేస్తూ వెళతాడు. అయినా అడుగడుగునా ఆ భక్తుడిని సదాశివుడు కాపాడుతూ వస్తాడు.
ఈ విషయాన్ని గ్రహించడంతో ఆ రాజు అజ్ఞానం తొలగిపోతుంది. పరమశివుడికి పరమ భక్తుడిని తాను అన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేసినందుకు పశ్చాత్తాపపడతాడు. తన తొందరపాటును మన్నించమని వాగీశానాయనార్ ను కోరతాడు. తన విషయంలో సహనాన్ని పాటించిన సదాశివుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఆ క్షణం నుంచి ఆయన శివారాధకుడై తన జన్మను చరితార్థం చేసుకుంటాడు.