ఆసక్తిని కలిగించే శ్రీనివాసుడి లీలావిశేషం
ఆకాశరాజు - ధరణీదేవి దంపతుల కుమార్తెగా లక్ష్మీదేవి అంశతో పద్మావతీదేవి లభిస్తుంది. వైకుంఠం నుంచి అలిగి వెళ్లిన ఆమెను వెతుకుతూ శ్రీమన్నారాయణుడు ... శ్రీనివాసుడుగా ఆ ప్రాంతానికి వస్తాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన పద్మావతి తన చెలికత్తెలతో వనంలో ఆడుతూ శ్రీనివాసుడి కంటపడుతుంది. గతంలో గల బంధం కారణంగా తొలిచూపులోనే ఆమె మనసు పారేసుకుంటుంది.
ఆమె మరొకరి కుమార్తెగా ఉంది కాబట్టి, వివాహం ద్వారా తన అర్థాంగిగా చేసుకోవాలని శ్రీనివాసుడు అనుకుంటాడు. అయితే అందుకు ఆమె స్థాయి అడ్డుపడుతుందని భావించి, ఆ అడ్డు తప్పించడం కోసం 'ఎరుకలసాని' వేషం కడతాడు. శ్రీనివాసుడిని చూసిన దగ్గర నుంచి ఆయన ఆలోచనలతో పద్మావతీదేవి నిద్రాహారాలకు దూరమవుతుంది. కారణం తెలియక ఆకాశరాజు దంపతులు ఆందోళన చెందుతుంటారు.
అదే సమయంలో ''సోది చెబుతానమ్మ ... సోది '' అంటూ ఎరుకలసానిగా ఆ వీధిలోకి శ్రీనివాసుడు ప్రవేశిస్తాడు. కూతురి పరిస్థితిని గురించి తెలుసుకోవడం కోసం ధరణీదేవి ఎరుకలసానిని అంతఃపురంలోకి పిలిపిస్తుంది. లోపలికి అడుగుపెడుతూనే పద్మావతిదేవి కనిపిస్తుందేమోనని ఆత్రుతగా చూస్తాడు శ్రీనివాసుడు.
అచ్చం సోది ఎలా చెబుతారో అదే తీరును అనుసరిస్తూ, వనంలో పద్మావతీదేవి ఒక పురుషోత్తముడిని చూసిందని చెబుతాడు. ఆయనపై మనసుపడిన ఆమె ఆ విషయాన్ని బయటికి చెప్పలేక బాధపడుతోందని అంటాడు. ఆ యువకుడితో ఆమెకి గల బంధం ఈనాటిది కాదని చెబుతాడు. ఆమె మనసు దోచినవాడు సామాన్యుడు కాడనీ ... ఆయనకి పిల్లనివ్వడం వలన వాళ్ల వంశం తరిస్తుందని చెబుతాడు.
ఇలా ఎరుకలసానిగా తన మాటలతో ధరణీదేవి మనసుని శ్రీనివాసుడు ప్రభావితం చేస్తాడు. మనసులోని మాటను చెప్పలేక ఇబ్బందిపడుతోన్న పద్మావతీదేవి మార్గాన్ని తేలికచేస్తాడు. పద్మావతీదేవిని భార్యగా పొందడానికి శ్రీనివాసుడు ప్రదర్శించిన ఈ లీలావిశేషం ఆమెపట్ల ఆయనకి గల ప్రేమానురాగాలకు నిదర్శనంగా నిలుస్తుంది. అద్భుతమైన ఆ దృశ్యమాలికను కనులముందు ఆవిష్కరింపజేసుకున్నవారి జన్మను తరింపజేస్తుంది.